పంచాయతీల్లోనూ పన్ను రాయితీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:25 AM
మున్సిపాలిటీల తరహాలో గ్రామపంచాయతీల్లో ముందస్తుగా ఇంటిపన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. 5శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల తరహాలో గ్రామపంచాయతీల్లో ముందస్తుగా ఇంటిపన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. 5శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో చేపట్టిన పన్ను వసూళ్ళు వందశాతం ఫలించడంతో వచ్చే సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే ఆఖరి లోపు చెల్లిస్తే ఇది వర్తిస్తుంది. జిల్లాలో 623 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,79,287 మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరినుంచి పన్ను రూపేణ ఏడాదికి సుమారు రూ.16 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు రాబడి వస్తోంది. సాధారణంగా ఏటా పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖ పరిధిలోని డీఎల్డీవోలు, ఉన్నతాధికారులు పన్నుల వసూళ్ళు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వసూళ్ళు కావాల్సిన పంచాయతీల్లో ఐదారుగురు అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. గురువారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇంటి పన్నుల చెల్లింపులకు ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మే 1 నుంచి 31 వరకు ఐదు శాతం రాయితీతో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించింది.ముందుగానే వసూలైన ఇంటిపన్నుల ద్వారా గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పన్ను వసూళ్ళలో స్టేట్ ఫస్ట్
గడచిన ఆర్థిక సంవత్సరంలో ఓవైపు ముసాయిదా గ్రామ పంచాయతీ ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో మునిగివున్నా పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లలో మార్చి ముగిసేసరికి 98.73 శాతం వృద్ధి సాధించారు. జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు. పన్నులు, పన్నేతర పన్నులు, బకాయి, కరెంట్ కలిపి రూ.27.30 కోట్లకు గాను రూ.26.27 కోట్లు (98.73శాతం) సాధించింది. 13 మండలాల్లోని పంచాయతీలు వందశాతానికి మించి పన్ను వసూళ్ళు చేయగా, మిగిలిన 14 మండలాల్లో 91-98 శాతం మధ్య నిలిచింది. రోజువారీ లక్ష్యాలు నిర్ధేశించి వసూళ్ళ ప్రగతిని కలెక్టర్ సుమిత్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ కార్యదర్శులను అప్రమత్తం చేసినందువల్లే ఇది సాధ్యమైంది. ఈ ఏడాది కూడా రూ.16 కోట్ల ఆస్తి పన్ను మేనెలలో ఎక్కువశాతం సాధించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.