మల్లప్పకొండపై తమిళనాడువాసి హత్య!
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:27 AM
గుడుపల్లె మండలం మల్లప్పకొండపై తమిళనాడుకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఏడాదిన్నర కూతురు, భార్య అదృశ్యమయ్యారు.
భార్య, చిన్నారి అదృశ్యం
ఇద్దరు పురుషులతో ప్రయాణిస్తూ సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన మహిళ
పోలీసుల అదుపులో నిందితులు?
కుప్పం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గుడుపల్లె మండలం మల్లప్పకొండపై తమిళనాడుకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఏడాదిన్నర కూతురు, భార్య అదృశ్యమయ్యారు. పసిబిడ్డతోపాటు ఒక మహిళ ద్విచక్ర వాహనంపై మల్లప్పకొండ మార్గంలో ప్రయాణిస్తూ గుడుపల్లె సమీపంలో సీసీటీవీ ఫుటేజీకి చిక్కింది. ఈ నేపథ్యంలో హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
శాంతిపురం మండలం బోయనపల్లెకు చెందిన మురుగేశ్, రుక్కమ్మ దంపతుల కుమార్తె హాసినికి, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూలగిరి తాలూకా దేవదాసనపల్లెకు చెందిన బసప్ప కుమారుడు రమేశ్ (30)తో 2024లో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల కుమార్తె మౌనిక ఉంది. ఈ క్రమంలో ఈనెల 13వ తేది (సోమవారం) ఆమె భర్త, బిడ్డతో పాటు బోయనపల్లెలోని పుట్టింటికి వచ్చింది. ఆ మరుసటి రోజు.. మంగళవారం మధ్యాహ్నం గుడుపల్లె మండలం మల్లప్ప కొండమీది ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శించుకుని వస్తామంటూ ముగ్గురూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రాత్రయినా వారు ఇంటికి రాలేదు. దీంతో హాసిని తల్లి రుక్కమ్మ బుధవారం ఉదయం రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు మల్లప్ప కొండపై గాలింపు చర్యలు చేపట్టడంతో పొదల్లో పడున్న రమేశ్ మృతదేహం బయటపడింది. తల, కాళ్లు, చేతులను కత్తులతో నరికినట్టు గాయాలను బట్టి పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య, బిడ్డ సంఘటనా స్థలంలో కనిపించలేదు.
సీసీటీవీ ఫుటేజికి చిక్కి
భర్త రమేశ్‌తో పాటు వచ్చిన హాసిని, ఏడాదిన్నర పసిబిడ్డ సహా అదృశ్యం కావడంతో వింతగా భావించిన పోలీసులు.. క్లూస్ టీంను రంగంలోకి దించారు. అదే సమయంలో బోయనపల్లెనుంచి గుడుపల్లె మండలంలోన మల్లప్పకొండకు వెళ్లే మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గుడుపల్లె మెయిన్ రోడ్డు రైల్వేస్టేషన్ క్రాస్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వెనుక బిడ్డతో కలిసి వెళ్తున్న మహిళ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. మళ్లీ కొద్ది సమయానికి అదే మహిళ, పసిబిడ్డతో కలిసి అదే ద్విచక్ర వాహనంలో ఇద్దరు పురుషులతో కలిసి వెనుదిరిగి రావడమూ రికార్డు అయింది.
అనుమానాలెన్నో?
భార్య హాసిని, బిడ్డతో కలిసి మల్లప్పకొండకు వెళ్లిన రమేశ్ అక్కడ హత్యకు ఎందుకు గురయ్యాడు? ఒకవేళ పాతకక్షలవల్ల ఎవరనా హత్య చేశారా? ఆ సమయంలో హాసిని ఎక్కడుంది? ఒక వేళ సంఘటన స్థలంలోనే ఉంటే అడ్డుకోవడానికి ప్రయత్నించలేదా? అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె మీద కూడా దుండగులు దాడి చేయలేదా? దాడి జరిగినా, జరగకపోయినా రమేశ్ హత్య తర్వాత హాసిని చిన్నారితో కలిసి ఎక్కడికి వెళ్లింది? ద్విచక్ర వాహనంపై మొదట ఒక పురుషునితో, తర్వాత ఇద్దరు పురుషులతో చిన్నారితో కలిసి ప్రయాణిస్తూ సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన మహిళ హాసినియేనా? ఆమె హాసిని అయితే ఆ ఇద్దరు పురుషులు ఎవరు? ఒకవేళ ఆ ఇద్దరు పురుషులే రమేశ్‌ను హత్య చేశారా? మరి హాసిని వారితో ఎందుకు పారిపోయింది? రమేశ్ హత్యకు కారణం పాత కక్షలా లేదా భార్య వివాహేతర సంబంధమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఇక, సీసీటీవీ ఫుటేజీలో మొదట ఒక పురుషుడు, రెండోసారి ఇద్దరు పురుషులతో కలిసి బిడ్డను ఎత్తుకుని ద్విచక్ర వాహనంపై కనిపిస్తున్న మహిళ హాసినియేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట భర్త రమేశ్‌తో, అతడి హత్య తర్వాత ఇద్దరు పురుషులతో కలిసి ఆమె ప్రయాణించిందని భావిస్తున్నారు. ఈ కోణాల్లో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కాగా, మల్లప్పకొండపై రమేశ్ హత్య కేసులో ఇద్దరు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
విచారిస్తున్నాం
దీనిపై కుప్పం డీఎస్పీ పార్థసారథిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, మల్లప్పకొండపై తమిళనాడువాసి రమేశ్ హత్యకు గురయ్యారని చెప్పారు. భార్య హాసిని, ఏడాదిన్నర పాపతో కలిసి మంగళవారం మధ్యాహ్నం మల్లప్పకొండకు దర్శనంకోసం వెళ్లారన్నారు. వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి రుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. దర్యాప్తు దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని డీఎస్పీ వివరించారు.