శెట్టిపల్లె ల్యాండ్‌పూలింగ్‌ను కేస్ స్టడీగా తీసుకోండి
ABN , Publish Date - May 08 , 2026 | 01:50 AM
తిరుపతి అర్బన్ మండల పరిధిలో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూముల సమస్యను ల్యాండ్‌పూలింగుతో పరిష్కరించడాన్ని అందరూ కేస్ స్టడీగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి కేంద్రంగా జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో గురువారం రాత్రి కలెక్టర్ వెంకటేశ్వర్ శెట్టిపల్లె మోడల్ టౌన్‌షిప్ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శెట్టిపల్లె భూముల విషయంలో ప్రజలు దశాబ్దాల తరబడి తిరిగి తిరిగి అలసిపోయారన్నారు. 2014లో ఈ భూములకు పరిష్కారం చూపి మెగా మోడల్ టౌన్‌షి్‌ప రూపొందించాలనుకున్నామని, ఎట్టకేలకూ ఈ ఏడాది దాదాపు రూ.1100కోట్ల విలువైన ఆస్తులను ప్రజలకు ఇవ్వగలిగామన్నారు
కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం సూచన
తిరుపతి(కలెక్టరేట్), మే 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్ మండల పరిధిలో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూముల సమస్యను ల్యాండ్‌పూలింగుతో పరిష్కరించడాన్ని అందరూ కేస్ స్టడీగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి కేంద్రంగా జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో గురువారం రాత్రి కలెక్టర్ వెంకటేశ్వర్ శెట్టిపల్లె మోడల్ టౌన్‌షిప్ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శెట్టిపల్లె భూముల విషయంలో ప్రజలు దశాబ్దాల తరబడి తిరిగి తిరిగి అలసిపోయారన్నారు. 2014లో ఈ భూములకు పరిష్కారం చూపి మెగా మోడల్ టౌన్‌షి్‌ప రూపొందించాలనుకున్నామని, ఎట్టకేలకూ ఈ ఏడాది దాదాపు రూ.1100కోట్ల విలువైన ఆస్తులను ప్రజలకు ఇవ్వగలిగామన్నారు.శెట్టిపల్లె ల్యాండ్‌పూలింగ్‌ను కేస్‌స్టడీగా తీసుకుని వివాదాల్లో ఉన్న భూసమస్యలు పరిష్కరించి అర్బన్ డెవల్‌పమెంట్‌కు నాంది పలకాలని సూచించారు.పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే అటు ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంతో పాటు సామాన్య ప్రజానీకానికి శెట్టిపల్లెలో మోడల్ టౌన్‌షి్‌పను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.శెట్టిపల్లెలో దాదాపు ఒకే భూమిపై గతంలో ఐదారు క్రయవిక్రయాలు జరగడంతో పాటు ఎన్నో వివాదాలుండేవన్నారు.2024లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. ఐదుసార్లు క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి ల్యాండ్‌పూలింగ్ విధానంలో మొత్తం భూముల్లో సుమారు 223 ఎకరాలను లబ్ధిదారులకు కేటాయించి 65 ఎకరాలను మోడల్ టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తుడాకు అప్పగించామన్నారు. దాదాపు 823మందికి రెండు సెంట్ల చొప్పున స్థలం వచ్చేలా 2,111 ప్లాట్లను లేఅవుట్‌లో రూపొందించామన్నారు.ఈ ప్లాట్లకు సంబంధించి లబ్ధిదారులు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ సుమారు రూ.17కోట్లు ప్రభుత్వమే భరించిందన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయానికి వస్తే తుడాకు ఇచ్చిన 65 ఎకరాల ద్వారా సమకూరే సుమారు రూ.250కోట్ల నిధులతో ఈ టౌన్‌షి్‌పలో విశాలమైన మాస్టర్‌ప్లాన్ రోడ్లు, డ్రైన్లు, సీసీరోడ్లు, గోవింధధామం, తాగునీరు, మురుగునీటి శుధ్ధి కేంద్రం, అండర్‌డ్రైనేజీ సిస్టమ్ వంటి సదుపాయాలతో వందడుగుల రోడ్లు అనుసంధానం చేస్తున్నామన్నారు.సరైన ప్రణాళికతో మౌలిక సదుపాయాలపై భరోసా ఇస్తే ప్రజలు భూసమీకరణకు ఎంత స్వచ్ఛందంగా ముందుకు వస్తారో ఈ ప్రాజెక్టు నిరూపించిందన్నారు.