Share News

సీఎంవో నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:46 AM

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

సీఎంవో నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టండి

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సోమవారం ఆదేశించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీఎంవో నుంచి వచ్చిన ఫిర్యాదులను కేవలం అర్జీలుగా పరిగణించకుండా, ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఆ ఫిర్యాదుల వివరాలివీ..

శాంతిపురం మండలం కర్లగట్టకు చెందిన చిన్నస్వామి భూరికార్డుల సమస్యపై ఫిర్యాదు చేశారు. తన భూమి రికార్డులు తొలినుంచీ తమ పేరుతోనే ఉన్నాయని, తాము సాగుచేస్తూ అనుభవంలో ఉన్నప్పటికీ రీసర్వే ప్రక్రియలో జాయింట్‌ ఎల్‌బీఎం నమోదు సందర్భంగా తమ పేరు తొలగించారని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యపై ఇప్పటికే మండల కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంలో రెండు, మూడు సార్లు అర్జీలిచ్చామన్నారు. తన ప్రాంతానికి సంబంధించిన ఎల్‌బీఎం నెం.39, సర్వే నెం.4/1, 4/2 అని వివరించారు. వెబ్‌ల్యాండ్‌ కరెక్షన్‌ ద్వారా ఇతరుల పేర్లు నమోదై జాయింట్‌ ఎల్‌బీఎంలోకి వచ్చినట్లు, తమ పేరును తొలగించి తిరిగి వెబ్‌ల్యాండ్‌ కరెక్షన్‌లో తమ పేరు నమోదు చేస్తామని అధికారులు గతంలో చెప్పినా, ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల సంబంధిత కార్యాలయానికి వెళ్లగా, తమ పరిధిలో ఈ అంశంపై చర్యలు తీసుకునే అధికారం లేదని అధికారులు చెప్పినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఫిర్యాదుదారుడి సమస్యను విన్న కలెక్టర్‌.. జాయింట్‌ ఎల్‌బీఎం, ఎక్స్ఛేంజ్‌ కరెక్షన్‌, వెబ్‌ల్యాండ్‌ కరెక్షన్‌కు సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉందో పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏదైనా ప్రపోజల్‌ ప్రక్రియలో ఉందా, లేక కొత్తగా ప్రపోజల్‌ సమర్పించాల్సి ఉందా అనే అంశాన్ని అధికారుల ద్వారా పరిశీలించి, తదుపరి చర్యలపై ఫిర్యాదుదారుడికి సమాచారం అందిస్తామన్నారు. ఈ సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా సర్వేయర్‌ను కూడా ఆదేశించారు.

ఐరాల మండలం కామినేనిపల్లి, వైఎస్‌ గెట్‌కు చెందిన సుశీలమ్మ తన భూమికి సంబంధించిన వన్‌బీ రికార్డు అందడంలేదని, రికార్డుల్లో ఇతరుల పేర్లు నమోదుకావడంతో భూ విస్తీర్ణానికి సంబంధించిన వివరాల్లోనూ తేడాలున్నాయని కలెక్టర్‌కు ఫోన్లో వివరించారు. ఈ సమస్యకు సంబంధించిన వివరాలు, నివేదికలను సమర్పించినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని ఫిర్యాదుదారులకు కలెక్టర్‌ సూచించారు.

కుప్పం మండలంలోని మల్లానూరు పంచాయతీ, ఇందిరమ్మనగర్‌లో తాగునీటి పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయని కలెక్టర్‌కు ఫోన్లో రఘు వివరించారు. ఈ సమస్యకు సంబంధించిన వివరాలు, నివేదికలను సమర్పించినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. సమస్యను కడా పీడీ క్షేత్రస్థాయిలో సందర్శించి ఐదు రోజుల్లో పరిష్కరిస్తారని చెప్పారు.

Updated Date - Aug 18 , 2026 | 01:46 AM