Share News

అమ్మను బాగా చూసుకోండి

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:35 AM

అమ్మను బాగు చూసుకోండి అని బాబాయికి మెసేజ్‌ చేసి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

అమ్మను బాగా చూసుకోండి
మహేంద్ర (ఫైల్‌ ఫొటో)

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అమ్మను బాగు చూసుకోండి అని బాబాయికి మెసేజ్‌ చేసి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి వెస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వేమనపల్లె గ్రామానికి చెందిన జయచంద్ర, రాధమ్మ కుమారుడు మహేంద్ర (20) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. వెంకటరమణ లేఅవుట్‌లో అద్దె గది తీసుకుని ఉంటున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు వారం కిందట వేరే వ్యక్తితో వివాహం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో.. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నన్ను క్షమించండి... మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం... ఆమెను బాగా చూసుకోండి’ అని తన ఆఖరి కోరికను బాబాయికి వాట్సాప్‌ మెసేజ్‌ పంపించాడు. అలాగే.. ‘నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. ఆమె నన్ను మోసం చేసింది.. ఆ బాధ భరించలేకపోతున్నాను’ అని చెల్లెలికి మెసేజ్‌ చేశాడు. అనంతరం గదిలోని సీలింగ్‌ హుక్కుకు దుప్పటితో ఉరేసుకున్నాడు. ఉదయం సుమారు ఏడు గంటలకు ఈ మెసేజ్‌లు చూసుకున్న కుటుంబీకులు మహేంద్ర అద్దెకు ఉంటున్న భవనంలోనే మరో గదిలో ఉన్న అతడి స్నేహితుడికి ఫోన్‌ చేశారు. అతను గది వద్దకొచ్చి చూసేసరికి మహేంద్ర ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 01:35 AM