Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:35 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టరు, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టండి
జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టరు, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. అధిక ప్రమాదాలు నమోదవుతున్న ఎన్‌హెచ్‌-69 (బెంగళూరు-పలమనేరు-చిత్తూరు-చెన్నై), ఎన్‌హెచ్‌-140 (చిత్తూరు-తిరుపతి), ఎన్‌హెచ్‌-42 (కుప్పం-పలమనేరు) రహదారులపై కలెక్టర్‌ సమీక్షించారు. జాతీయ రహదారులపై తగిన లైటింగ్‌, రహదారి భద్రతా ప్రమాణాలు, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. జాతీయ రహదారులపై నిర్వహించిన సంయుక్త తనిఖీలలో గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సరిదిద్దాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లను ఆదేశించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీఎం-ఆర్‌ఏహెచ్‌ఏటీ పథకం అమలు, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, 104, 108 అత్యవసర సేవల పనితీరుపైనా సమీక్షించారు. రోడ్డు భద్రతపై ప్రజల నుంచి వస్తున్న సూచనలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించాలన్నారు. జిల్లా సమావేశంలో ఎస్పీ తుషార్‌ డూడీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 01:35 AM