Share News

టెన్త్‌లో ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం!

ABN , Publish Date - Mar 28 , 2026 | 01:24 AM

టెన్త్‌ విద్యార్థుల జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ‘ట్యాబ్‌ (డిజిటల్‌) ఆధారిత మూల్యాంకనం’ చేపట్టనుంది

 టెన్త్‌లో ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం!

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): టెన్త్‌ విద్యార్థుల జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ‘ట్యాబ్‌ (డిజిటల్‌) ఆధారిత మూల్యాంకనం’ చేపట్టనుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు జవాబు పత్రాలు దిద్దిన తర్వాత మార్కులను ఓఎంఆర్‌ షీట్‌లో నమోదు చేసేవారు. ఇందులో జరిగే పొరబాట్లతో విద్యార్థులు నష్టపోయిన సందర్భాలు లేకపోలేదు. ఈ ఏడాది ఓఎంఆర్‌ షీట్‌ ప్రక్రియకు స్వస్తి చెబుతూ, వాటి స్థానంలో ట్యాబ్‌లను వినియోగించనున్నారు. డిజిటల్‌ విధానంతో పారదర్శకత, వేగం, కచ్చితత్వం ఉండనుంది. మూల్యాంకనం ప్రక్రియలో స్పెషల్‌ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (టీచర్లు) మూల్యాకనం చేస్తారు. వీటిని చీఫ్‌ ఎగ్జామినర్లు పరిశీలన తర్వాత స్పెషల్‌ అసిస్టెంట్లు ఆ జవాబు పత్రాలను స్కాన్‌ చేస్తారు. ఒక వేళ మార్కుల నమోదులో పొరబాట్లు జరిగితే స్కాన్‌లో కచ్చితమైన మార్కులు నమోదువుతాయి. వాటిని వెంటనే సెంట్రల్‌ సర్వర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. ఈ మార్కులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించనున్నారు. మూల్యాంకనంలో ట్యాబ్‌ల వినియోగం విద్యా వ్యవస్థను డిజిటల్‌ దిశగా ముందుకు తీసుకుపోడానికి దోహదపడుతుంది. కాగా ఈనెల 16న మొదలైన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్ష ఏప్రిల్‌ 2 నాటికి ముగియనుంది. దీంతో ఏప్రిల్‌ 4 నుంచి సుమారు వారం నుంచి 10 రోజుల పాటు జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జవాబు పత్రాల మూల్యాకనం చేయనున్నారు.

368 ట్యాబ్‌ల వినియోగం

ఇందుకోసం 318 ట్యాబ్‌లు అవసరం కాగా జిల్లా విద్యాశాఖ అధికారులు 368 సిద్ధం చేశారు. వాటికి ప్రత్యేకంగా సీక్రెట్‌ లాక్‌ నెంబరు కేటాయిస్తారు. మూల్యాంకనంలో నియమించే స్పెషల్‌ అసిస్టెంట్లు వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి చిత్తూరు జిల్లాకు సుమారు 1.80 లక్షల నుంచి 2 లక్షల జవాబు పత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు చేరిన జవాబు పత్రాలను స్పాట్‌ సెంటర్‌లో విద్యాశాఖలోని పరీక్షల విభాగం సిబ్బంది డీకోడ్‌ చేసి స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌ రూంల ముందు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 24/7 పోలీసు బందోబస్తు నియమించారు. ఏప్రిల్‌ 4 నుంచి మొదలయ్యే మూల్యాంకనం ప్రక్రియలో సుమారు 250 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 800 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 410 మంది స్పెషల్‌ అసిస్టెంట్ల పాల్గొననున్నారు.

మార్కుల్లో తేడాలు ఉండవు

విద్యార్థులు అదనపు ప్రశ్నలకూ సమాధానాలు రాస్తుంటారు. మూల్యాంకనం సమయంలో వాటికి మార్కులు వేసినా, ట్యాబ్‌లో స్కాన్‌ చేసినప్పుడు నిర్దేశిత ప్రశ్నలను మాత్రమే పరిగణిస్తుంది. అందులోనూ అత్యధిక మార్కులు వచ్చిన వాటినే తీసుకుంటుంది. ఇప్పటి వరకు మార్కులు లెక్కించేటప్పుడు పొరబాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు 82 మార్కులు వస్తే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 28గా నమోదవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు పరీక్ష తప్పిన సందర్భాలున్నాయి. ఇకపై ట్యాబ్‌ ఆధారిత (డిజిటల్‌) విధానంలో అలాంటి పొరబాట్లకు తావుండదని నిపుణుల వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 01:24 AM