పంచాయతీ ఎన్నికలకు గుర్తులొచ్చేశాయి!
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:09 AM
సర్పంచులకు 25, వార్డు మెంబర్లకు 20 వంతున కేటాయింపు బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లుండవు. వరుస నంబర్లతో సరి నోటాకు కూడా ఓటు వేసే అవకాశం
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. ఈ సందర్భం ఎన్నికల కోసం అభ్యర్థులకు సరిపడేటట్లు గుర్తులను కూడా ఎంపిక చేసి స్థానిక అధికారులకు ఆ వివరాలను అందజేశారు. సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తుల వంతున కేటాయించారు. ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థుల సంఖ్య ఇంతకు మించి పెరిగితే కేటాయించడానికి జిల్లా అధికారుల వద్ద రిజర్వు గుర్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఫ సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు.. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్ళు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతి కర్ర, చెంచా. వార్డు సభ్యుల గుర్తులు.. ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్ర్తీపెట్లె, పోస్టు డబ్డా, గ్యాస్, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయరు, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయొలిన్, బెండకాయ, బెల్టు, కోటు.
నోటాకు కూడా ఓటేయ్యొచ్చు
పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటా గుర్తుకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల తరువాత చివరన నోటా గుర్తు వుంటుంది. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లుండవు, అభ్యర్థుల పేర్లకు బదులుగా 1, 2, 3 లాంటి వరుస సంఖ్యలు మాత్రమే వుంటాయి. ఈ సంఖ్యలకు ఎదురుగా అభ్యర్థికి కేటాయించిన గుర్తు వుంటుంది. గతంలో ముగ్గురు, నలుగురు, ఐదుగురు అభ్యర్థులకు సరిపడా గుర్తులు, వరుస నుంబర్లతో బ్యాలెట్ పేపర్లను ముందుగానే ముద్రించి సిద్దం చేసేవారు. అవసరమైతే అభ్యర్థుల సంఖ్యను బట్టి బాలెట్ పేపర్లను చించి సిద్దం చేసేవారు. ఉదాహరణకు ఇద్దరూ, ముగ్గురు అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు ఎక్కువ అవసరమైతే నాలుగు, ఐదు గుర్తులున్న బ్యాలెట్ పేపర్లను ఇద్దరూ, ముగ్గురు అభ్యర్థులకు సరిపడా వుంచి చివరలో మిగిలిన గుర్తులను చించి సిద్దం చేసేవారు. అయితే ఇప్పుడు చివరలో నోటా గుర్తు ఉన్న కారణంగా అలా కట్ చేయడం కుదరదు.