వార్డ్ బాయ్స్‌గా స్విమ్స్ వర్కర్లు?
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:22 AM
సుదీర్ఘకాలంగా స్విమ్స్‌లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు శుభవార్త అందనుంది. శానిటేషన్ వర్కర్ల పేరును వార్డ్ బాయ్స్‌గా మార్చడంతో పాటు వేతనాన్ని పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి.
మంత్రి లోకేశ్ లేఖతో కదిలిన టీటీడీ
స్విమ్స్ అధికారులతో జేఈవో చర్చలు
తిరుపతి, మార్చి18(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా స్విమ్స్‌లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు శుభవార్త అందనుంది. శానిటేషన్ వర్కర్ల పేరును వార్డ్ బాయ్స్‌గా మార్చడంతో పాటు వేతనాన్ని పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి.బుధవారం టీటీడీ జేఈవో శరత్ స్విమ్స్‌ను సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. శానిటేషన్ వర్కర్ల పేరును గతంలో ఉన్నట్టు వార్డ్‌బాయ్స్‌గా మార్చాలని, అందుకనుగుణంగా వేతనాలను సవరించాలని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీటీడీ ఈవోకు లేఖ రాయడంతో యంత్రాంగంలో కదలిక కనిపించింది. ఎస్‌ఎల్‌ఎంపీసీ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో స్విమ్స్‌లో 441 మంది దాదాపు 30ఏళ్లుగా వార్డుబాయ్స్‌గా పనిచేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో శానిటరీ వర్కర్లుగా పేరు మార్చారు. ప్రస్తుతం వీరికి రూ.13వేలు వేతనంగా వస్తోంది. ఇదే టీటీడీలో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న స్వీపర్లు రూ.22 వేలు పొందుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వలన చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కొవిడ్ కాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించిన వార్డు బాయ్స్ తమ గోడును వివరిస్తూ గత నెలలో మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారి డిమాండుపై ఆయన స్పందించి టీటీడీ ఈవోకు లేఖ రాయాలని ఓఎస్సీడీ డాక్టర్ వరప్రసాద్‌ను ఆదేశించారు. నెలరోజులు గడుస్తున్నా వారికి స్పష్టత ఇవ్వకపోవడంతో వార్టుబాయ్స్ ఆందోళన చెందుతున్న క్రమంలో టీటీడీ జేఈవో స్విమ్స్‌ను సందర్శించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలపడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.