అక్కడ తీపి... ఇక్కడ చేదు
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:05 AM
ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి అందరికీ తీపిని పంచే చెరకు రైతులకు చేదు అనుభవాలు తప్పడం లేదు. మద్దతు ధర చాలా తక్కువగా ఉండడంతో పెట్టుబడి కూడా రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తమిళనాట చెరకు టన్ను రూ.4,500, జిల్లాలో రూ.3290
మద్దతు ధరలో భారీ వ్యత్యాసం
నగరి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి అందరికీ తీపిని పంచే చెరకు రైతులకు చేదు అనుభవాలు తప్పడం లేదు. మద్దతు ధర చాలా తక్కువగా ఉండడంతో పెట్టుబడి కూడా రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులోని పరిశ్రమలు చెల్లిస్తున్న ధరకు మన జిల్లాలో చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉంటోంది. తమిళనాడులో చెరకు టన్నుకు రూ.4,500 ఇస్తుండగా, జిల్లాలో రూ.3290 మాత్రమే చెల్లిస్తున్నారు. తమిళనాడులోని బన్నారి చక్కెర కర్మాగారం రూ.4,500, సెంజి ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.4,450 చెల్లిస్తోంది. అలాగే తిరువళ్లూరు జిల్లా తీరువలాంగాడులోని సహకార చక్కెర కర్మాగారం టన్నుకు రూ.4000 రైతులకు చెల్లిస్తూ రవాణా ఖర్చులను పరిశ్రమే భరిస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఎస్‌ఎన్‌జే చక్కెర కర్మాగారం మాత్రం టన్నుకు రూ.3290 చెల్లిస్తూ ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. చెరకు మద్దతు ధర పెంచాలని పలుమార్లు చక్కెర కర్మాగార యాజమాన్యంతో చర్చించినా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇస్తే తప్ప తామేమీ చేయలేమని చెప్పారని రైతులు పేర్కొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం టన్నుకు రూ.500నుంచి రూ.700వరకు ప్రోత్సాహక ధర ఇవ్వడంతో అక్కడి పరిశ్రమలు నాలుగు వేల రూపాయలకు పైగా ఇవ్వగలుగుతున్నాయని, ఇక్కడ అలాంటి ప్రోత్సాహకాలు లేవని ఎస్‌ఎన్‌జే కర్మాగార యాజమాన్యం చెబుతోంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రభుత్వం చెరకు మద్దతు ధర పెంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు.