సుప్రీం మార్గదర్శకాలే బీసీ రిజర్వేషన్లకు ప్రామాణికం
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:27 AM
స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ప్రామాణికమని డెడికేషన్ కమిషన్ చైర్మన్ రంజన్ మిశ్రా చెప్పారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో శనివారం రిజర్వేషన్లపై అధ్యయనం, బీసీ సంఘాల నాయకుల నుంచి వినతులను ఆయన స్వీకరించారు.
డెడికేషన్ కమిషన్ చైర్మన్ రంజన్ మిశ్రా
చిత్తూరు అర్బన్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ప్రామాణికమని డెడికేషన్ కమిషన్ చైర్మన్ రంజన్ మిశ్రా చెప్పారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో శనివారం రిజర్వేషన్లపై అధ్యయనం, బీసీ సంఘాల నాయకుల నుంచి వినతులను ఆయన స్వీకరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను స్వీకరించి.. సమగ్ర అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తామన్నారు. అంతకుముందు బీసీ సంక్షేమశాఖ అధికారులతో కమిషన్ విధి విధానాలపై సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో వారికి అందుతున్న రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబించే సమాచారాన్ని స్వీకరించేందుకు కమిషన్ పర్యటిస్తుందన్నారు. జిల్లాలో వన్నియకుల క్షత్రియ, కురబ, రజక కులాల సమస్యలు అధిక సంఖ్యలో ఉన్నాయన్నారు. జిల్లాలో సుమారు 4.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. 2021లో రిజర్వేషన్ ప్రకారం 181 మంది బీసీలు సర్పంచులుగా, 2500 మంది వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు షణ్ముగం, రవీంద్రరాజు, డీఆర్వో మోహన్ కుమార్, జడ్పీ సీఈవో రవికుమార్, కమిషనర్ నరసింహప్రసాద్, బీసీ సంక్షేమాధికారి రబ్బానిబాషా తదితరులు పాల్గొన్నారు.
సచివాలయంలో బీసీ రికార్డుల పరిశీలన
చిత్తూరు కల్చరల్, ఆంధ్రజ్యోతి: చిత్తూరు నగరం 75 దొడ్డిపల్లె సచివాలయంలో రాష్ట్ర బీసీ రికార్డులను డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ మిశ్రా పరిశీలించారు. ఏకీకృత కుటుంబ సర్వే జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ప్రదర్శించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఐడీ కేటాయించాలన్నారు. సచివాలయ పరిధిలో బీసీ గణాంకాలను ఆయన పరిశీలించారు. జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, కమిషనరు నరసింహప్రసాద్, డీఎల్‌డీవో రవి, సచివాలయ అదికారి మురళి, సెక్రటరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.