టమోటాకు వేసవి సెగ
ABN , Publish Date - May 11 , 2026 | 01:32 AM
ఎండల ప్రభావంతో మాడిపోతున్న మొక్కలు అదనపు వ్యయభారంతో రైతులకు వెతలు నాలుగుసార్లు నాటినా తప్పని పాట్లు
మదనపల్లె, మే 10(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా పంటపై ప్రస్తుతం ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సీజన్‌లో చిత్తూరు, కర్ణాటక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు వంద హెక్టార్లలో టమోటా సాగు చేయనున్నట్లు అంచనా. ఫిబ్రవరి 15 నుంచి మొదటి విడత, మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రెండో విడత, ఏప్రిల్ 15వ తేదీలోపు మూడో విడత, మే మొదటి వారంలో నాలుగో విడతలో మొక్కలు నాటడం మొదలుపెడతారు. ఫిబ్రవరిలో నాటిన పంట ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. రెండో విడతగా నాటిన పంట పూత, పిందె దశలో ఉంది. మూడో విడత ఏప్రిల్‌లో నాటిన మొక్కలు ఎండల ప్రభావంతో చనిపోతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలతో మాడిపోతున్న మొక్కలు
ఈ సీజన్‌లో ఎండలు 25 డిగ్రీలకు లోపల ఉంటేనే మంచి దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం ఎల్‌నీనో ప్రభావంతో 37 నుంచి 40 డిగ్రీలను తాకుతుండటంతో మొక్కలు నిలువునా మాడిపోతున్నాయి. దీంతో రైతులు తిరిగి అదే సాలుపై పక్కనే ప్లాస్టిక్ కవర్‌కు రంధ్రం పెట్టి మరో మొక్క నాటుతున్నారు. ఇలా మూడో విడతలోని పంటకు మూడు నుంచి నాలుగు సార్లు మొక్కలు పెడుతున్నారు. ఇలా ఒకే పంటలో విడతల వారీగా చనిపోయిన మొక్కస్థానంలో పక్కనపక్కనే నాటడం రైతుకు అదనపు భారంగా మారింది. మొదట్లో నాటే మొక్క రూ.1.50 ఉండగా, రెండోసారి మొక్క రూ.2 కొనగోలు చేయాల్సివస్తోంది. పైగా ఒకే పంటలో నాలుగు రకాల మొక్కల సైజుతోపాటు దిగుబడులు కూడా అదే విధంగా ఉండనున్నాయి. మొక్క ఉన్నా లేకున్నా డ్రిప్ నీటితోపాటు మందులు కూడా వేస్తున్నారు.
అదనపు ఖర్చు
ఎకరా నేలలో మొక్కలు నాటడానికి రూ.28వేల నుంచి రూ.30వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎకరా సాగుకు అయ్యే రూ.2లక్షలకు ఇది అదనపు భారంగా మారుతోంది. భూమి, ప్లాస్టిక్ కవర్ నుంచి వచ్చే వేడిని అధిగమించేందుకు మొక్కకు మొదలు భాగంలో ప్లాస్టిక్ కప్పు, పైభాగంలో మందులు పిచికారి చేస్తున్నారు. కొందరు రైతులు భూమిలో ఒకేసాలుపై రెండు వరుసల్లో మొక్కలు నాటారు. పైగా నారుకు డిమాండ్ రైతులకు కష్టాలు తప్పడం లేదు.
ఎండలకు చనిపోవడం ఇదే మొదటిసారి
నేను 30 ఏళ్లుగా టమోటా సాగు చేస్తున్నా. ఎండలతో మొక్క మొదలు మొత్తబడి చనిపోవడం ఫస్ట్ చూస్తున్నా. ఏప్రిల్ 15వ తేదీ నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. నాలుగోసారి నాటడానికి 5వేల మొక్కలు సిద్ధం చేసినా. రూ.30వేలు ఖర్చు అయింది.
- కె.వెంకటరమణారెడ్డి, మామిడిగుంతలపల్లె, మదనపల్లె మండలం
మొక్కలు దొరకడం లేదు
నేను 1.75 ఎకరాల్లో టమోటా వేశాను. చనిపోయిన మొక్కల స్థానంలో ఇప్పటికే మూడుసార్లు నారు నాటాను. మొక్కలు చాలా డిమాండ్‌గా ఉన్నాయి. ఎక్కడా దొరకడం లేదు. మొక్కకు రూ.3 ఇస్తామన్నా లేవు.
- కె.శంకర్‌రెడ్డి, దిగువ మామిడిగుంతలపల్లె, మదనపల్లె మండలం.