తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ సక్సె్‌స
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:10 AM
స్పే్‌సటెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు అంబరాన్నంటాయి
ప్రత్యేక ఆకర్షణగా మంత్రి లోకేశ్
సూళ్లూరుపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి):స్పే్‌సటెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ను సజావుగానే సాగింది. 11.30 గంటలకు జరగాల్సిన ప్రయోగం సాంకేతిక సమ స్య తలెత్తడంతో 5నిమిషాల ముందు కౌంట్‌డౌన్ నిలిపివేశారు. మిషన్ కం ట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు..విజిటర్స్ గ్యాలరీలో విద్యార్థులందరూ నింగివైపు చూస్తుండగా 11.25 గంటలకు కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో అందరిలో ఉత్కంఠ... ప్రయోగం జరుగుతుందా? లేదా? అన్న సందేహం మొదలైంది.దాదాపు 20నిమిషాల తరువాత కౌంట్‌డౌన్ పునఃప్రారంభమైంది.రాకెట్ ప్రయో గం 12.05 గంటలకు వుంటుందని సందేశం రావడంతో అందరూ కరతాళ ధ్వనులతో మళ్లీ నింగివైపు దృష్టి సారించారు. కౌంట్‌డౌన్ సున్నకు చేరగానే ప్రథమ ప్రయోగ వేదిక నుంచి నిప్పు లు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం చూసి సందర్శకులు,
శాస్త్రవేత్తలు చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగి తేలారు.16.36 నిమిషాల్లో నాలుగు దశలను సునాయాసం గా పూర్తి చేసుకుని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చడంతో సంబరాల్లో మునిగితేలారు. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ప్రయోగాన్ని వీక్షిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, మాజీ చైర్మన్లు, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఆనందాన్ని పంచుకున్నారు. స్కైరూట్ సంస్థ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. స్కైరూట్ సీఈవో పవన్‌కుమార్ హలో స్పేస్ విక్రమ్-1 వచ్చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
2.30 గంటల పాటు షార్‌లోనే మంత్రి లోకేశ్
తొలిసారిగా షార్‌కు విచ్చేసిన మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కుమారుడు దేవాన్ష్‌ను వెంట బెట్టుకుని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు, ఎమ్మెల్యే విజయశ్రీ దంపతులతో కలిసి ప్రయోగాన్ని వీక్షించారు.రాకెట్ బ్రో చర్‌ను తీసుకుని ప్రయోగ వివరాలను కుమారుడికి వివరిస్తూ శాస్రవేత్తల నుంచి వివరాలు తెలుసుకుంటూ గడిపారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, మాజీ చైర్మన్లు రాధాకృష్ణ, ఏఎస్ కిరణ్‌కుమార్ లోకేశ్‌తో మాట్లాడారు. ఉదయం 10.28 గంటలకు షార్‌కు చేరుకున్న లోకేశ్ మధ్యాహ్నం 1.10 గంటల వరకూ అక్కడే వుండి ప్రయోగాన్ని వీక్షించి తిరుగు పయనమయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి తది తరులు ప్రయోగాన్ని తిలకించారు.