Share News

- నామినేషన్ల ఉపసంహరణపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:28 AM

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియపై డివిజన్ల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు

- నామినేషన్ల ఉపసంహరణపై   24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

చిత్తూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియపై డివిజన్ల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం 15 మంది ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లోగా నివేదిక అందించాలని స్పష్టంచేశారు. చిత్తూరు కార్పొరేషన్‌లో నామినేషన్లను ఉపసంహరించుకున్న ప్రతి అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను నివేదికలో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్‌ పేర్కొన్నారు. అభ్యర్థి పేరు, వార్డు నంబరు, రాజకీయ పార్టీ పేరు, ఉపసంహరణ నోటీసు అందిన తేదీ, సమయం వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంది. ఉపసంహరణకు గల కారణాల్ని కూడా నమోదు చేయాలని స్పష్టం చేశారు. విచారణ నివేదికలను ఆర్వోలు 24 గంటల్లోగా అందించాలని.. ఆలస్యం చేసినా, సమాచారంలో తప్పులున్నా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..

చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు 15 కేంద్రాలను ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించారు. పరిశీలన సమయంలో సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంగా నాలుగు డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను ఆర్వోలు తిరస్కరించారు. 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అదే రోజు రాత్రికి 51 డివిజన్లు ఏకగ్రీవమైనట్లు, 9 చోట్లే ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవమైన 51 డివిజన్లలో 48 టీడీపీకి, జనసేన, బీజేపీ, వైసీపీకి ఒక్కోటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి.

కలెక్టర్‌, ఎస్పీ ప్రత్యేక దృష్టి

చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్‌ చొరవ తీసుకుని 15 కేంద్రాల్లోని నామినేషన్లను ఒకేచోటికి అంటే కార్పొరేషన్‌ కార్యాలయానికి తెప్పించి, అక్కడే అభ్యర్థులు విత్‌డ్రా చేసుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఎస్పీ పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి ఎవరూ కార్యాలయం వైపు రాకుండా చేశారు. ఒకానొక సందర్భంలో ఎస్పీనే లాఠీ పట్టి గుంపుల్ని చెదరగొట్టారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ కూడా మున్సిపల్‌ కార్యాలయంలో ఉండి ప్రక్రియ పర్యవేక్షించారు.

వైసీపీ ఆరోపణ, నిరసన

చిత్తూరులో జరిగిన ఏకగ్రీవాలు అక్రమమంటూ వైసీపీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించగా, గురువారం చిత్తూరు గాంధీ సర్కిల్‌లో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ శ్రేణులతో నిరసనలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:28 AM