పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 02:19 AM
మదనపల్లె జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో సుబ్రమణ్యం తెలిపారు.
మదనపల్లె అర్బన్, మార్చి 14: జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో సుబ్రమణ్యం తెలిపారు. శనివారం మదనపల్లెలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 124 కేంద్రాల్లో 22,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని సూచించారు. 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్కాడ్ ఏర్పాటు చేశామన్నారు. ఒన్ సిట్టింగ్ ఓపెన్ టెన్త్ పరీక్షలు 10 కేంద్రాల్లో 648 మంది విద్యార్థులు రాస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, 1,177మంది ఇన్విజిలేటర్లను, 240మంది సూపరింటెండెంట్లు, డిపార్టమెంటల్ ఆఫీసర్లను నియమించామన్నారు. సమస్యలు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరు 9100040686ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, శనివారం వాల్మీకిపురం జడ్పీ బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. పరీక్ష రాసే విధానంపై అవగాహన కల్పించారు.