గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 27 , 2026 | 12:51 AM
చిత్తూరు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండ విజృంభించినా సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వాన కురిసింది. చిత్తూరు నగరంతో పాటు పరిసర మండలాల్లో హోర్డింగులు గాలికి ఎగిరిపడ్డాయి. భారీవృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గంటన్నర పాటు వర్షం కురిసింది.
పలుచోట్ల విరిగిపడ్డ విద్యుత్ స్తంబాలు
చిత్తూరు కలెక్టరేట్/శాంతిపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండ విజృంభించినా సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వాన కురిసింది. చిత్తూరు నగరంతో పాటు పరిసర మండలాల్లో హోర్డింగులు గాలికి ఎగిరిపడ్డాయి. భారీవృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గంటన్నర పాటు వర్షం కురిసింది. పోలీసు, మునిసిపల్, విద్యుత్‌శాఖల అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. చిత్తూరులో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 32వ డివిజన్‌లోని ధర్మరాజుల కాలనీలో ఓ ఆటోపై విద్యుత్ స్తంభం కూలింది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. శాంతిపురం మండలంలో గాలివాన బీభత్సానికి పంటలు, గ్రీన్ హౌసులు దెబ్బతిన్నాయి. పెద్దబొమ్మనపల్లెలో బొప్పాయి, టమోటా నేల మట్టం అయ్యాయి. మొరసనపల్లె వద్ద నర్సరీపైన భారీ చెట్టు కులింది. ఆదర్శ పాఠశాల వద్ద గ్రీన్ హౌస్ గాలికి ఎగిరిపోయింది. జంగాలపల్లెలో అరటి తోట పూర్తిగా దెబ్బతింది. సుమారు 8 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జీడీ నెల్లూరు,నగరి,పరిసర ప్రాంతాల్లో గాలివాన ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా మధ్యాహ్నం వరకూ నిండ్ర మండలంలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.