Share News

గిరిజన తాండాల్లో సారా తయారీకి స్వస్తి

ABN , Publish Date - May 21 , 2026 | 01:51 AM

గ్రామాల్లో సారా తయారీ, అక్రమ రవాణా, విక్రయాలు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం-2 పథకం జిల్లాలో విజయవంతమవుతోంది. ఈ పథకం కింద తొలివిడతగా 54 మంది గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం రూ.70లక్షల రుణాలు అందించింది. వారంతా సారా తయారీ వదిలి గర్వంగా తలెత్తి బతుకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 65శాతం సారా కేసులు తగ్గడమే ఇందుకు నిదర్శనం.

గిరిజన తాండాల్లో  సారా తయారీకి స్వస్తి
ఆటో కొనుగోలు చేసిన గోవిందస్వామి నాయక్‌

65శాతం తగ్గిన సారా కేసులు

గ్రామాల్లో సారా తయారీ, అక్రమ రవాణా, విక్రయాలు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం-2 పథకం జిల్లాలో విజయవంతమవుతోంది. ఈ పథకం కింద తొలివిడతగా 54 మంది గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం రూ.70లక్షల రుణాలు అందించింది. వారంతా సారా తయారీ వదిలి గర్వంగా తలెత్తి బతుకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 65శాతం సారా కేసులు తగ్గడమే ఇందుకు నిదర్శనం.

-మదనపల్లె టౌన్‌, ఆంధ్రజ్యోతి

జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, గుర్రంకొండ, కలికిరి, పెదమండ్యం, వాల్మీకిపురం మండలాల్లో సుగాలి/లంబాడి తాండాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తాండాల్లో పెద్దగా చదువుకోని వారు ఉంటున్నారు. వీరిలో 90శాతం మంది సారా తయారే జీవనంగా సాగించేవారు. సారా తయారీ, అక్రమ రవాణా, పట్టణాల్లో విక్రయిస్తూ పలు కేసుల్లో ఇరుక్కునేవారు. కొందరైతే జైలు జీవితాల్లో మగ్గిపోయేవారు. అంతేకాకుండా సారా తాగి వేలాదిమంది అనారోగ్యం పాలయ్యేవారు. పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నవోదయం-2 పథకాన్ని ప్రవేశపెట్టింది. డీఆర్‌డీఏ శాఖ ద్వారా గిరిజన తాండాల్లో సారా తయారు చేసే వారిని గుర్తించింది. వీరికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి, సక్రమ మార్గాల్లో జీవనోపాధి కల్పించింది. దీంతో సారా తయారీ వృత్తిని వీడి గిరిజనులు సరికొత్త జీవనం సాగిస్తున్నారు.

తొలి విడతతో 54 మందికి రుణాలు

జిల్లాలోని 8 ఎక్సైజ్‌ సర్కిళ్లలోని గిరిజన తాండాల్లో సారా తయారు చేసే వారిలో మార్పు కోరుకునే వారిని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. సారా తయారీని వీడి గౌరవంగా బతికేందుకు నవోదయం-2 పథకం కింద 325 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెంటెండ్‌ మధుసూదన్‌ ఆధ్వర్యంలో 8 ఎక్పైజ్‌ సర్కిళ్లలో దరఖాస్తులు స్వీకరించారు. వీటిని డీఆర్‌డీఏ శాఖకు పంపారు. వీరికి ఒక్కొక్కరికి రూ.70వేల నుంచి రూ.లక్ష దాకా సబ్సిడీ రుణాలు మంజూరుకు డీఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేశారు. ఇందులో 54 మందిని ఎంపిక చేసి తొలివిడతగా రూ.70.40లక్షల మేర రుణాలు మంజూరు చేశారు. పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, ఆటోల కొనుగోలుకు ఈ రుణాలు వినియోగించాలని సూచించారు. లబ్ధిదారులందరూ సారా తయారీకి స్వస్తి పలికి ఇతర పనుల ద్వారా బతుకుతున్నారు. త్వరలో రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు మంజూరుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

65శాతం తగ్గిన సారా కేసులు

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే సారా కేసులు గణనీయంగా తగ్గాయి. 2025 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 229 సారా కేసులు నమోదు కాగా, 133 మందిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. 1,291లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 56,390 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు గణాంకాలు చూస్తే కేవలం 79 కేసులు నమోదు కాగా, 25 మంది నిందితులను అరెస్టు చేశారు. 203 లీటర్ల సారా స్వాధీనం చేసుకోగా, 18,565 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు.

సారా రహిత జిల్లాగా మారుస్తాం

సారా రహిత జిల్లాగా మార్చే దిశాగా పనిచేస్తున్నాం. నవోదయం-2 పథకం జిల్లాలో ఎంతో మార్పు తీసుకొస్తోంది. నాలుగు నెలల్లో (2026 జనవరి నుంచి) గిరిజనులకు సబ్సిడీ రుణాలు రూ.70లక్షలు ఇప్పించాం. తద్వారా సారా తయారీ దాదాపు తగ్గిపోవచ్చింది. మిగిలిన 271 మంది లబ్ధిదారులకు కూడా నవోదయం-2 రుణాలు ఇప్పిస్తాం.

- మధుసూదన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - May 21 , 2026 | 01:51 AM