ఇప్పటికీ అదే షాక్
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:33 AM
వైసీపీ ప్రభుత్వంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డారు. విద్యుత్తు శాఖలో నట్టు, బోల్టుల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల వరకు అమాంతంగా ధర పెంచి కాంట్రాక్టు పొందారు. అప్పటి సామగ్రిని.. అదే ధరలకు ఇప్పుడూ కొనాల్సి రావడం రైతుకు భారంగా మారింది.
వైసీపీ కమీషన్ల కక్కుర్తి ఫలితం
అధిక ధరలతో విద్యుత్తు సామగ్రి సరఫరా కాంట్రాక్టు పొందిన కంపెనీలు
ఇప్పటికీ అవే అమలుతో భారం
గత రేట్లతోనే తాజాగా వేసిన టెండర్లకు బ్రేక్
మెటీరియల్ సరఫరా కాక రైతులకు అవస్థలు
వైసీపీ ప్రభుత్వంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డారు. విద్యుత్తు శాఖలో నట్టు, బోల్టుల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల వరకు అమాంతంగా ధర పెంచి కాంట్రాక్టు పొందారు. అప్పటి సామగ్రిని.. అదే ధరలకు ఇప్పుడూ కొనాల్సి రావడం రైతుకు భారంగా మారింది.
మరోవైపు.. ‘కూటమి’ ప్రభుత్వంలో రెట్టింపు ధరలతోనే వేసిన టెండర్లకు బ్రేక్ పడింది. మెటీరియల్ సరఫరా ఆగింది. కొత్త సర్వీసులకోసం ట్రాన్స్‌ఫార్మర్ల కోసం కొందరు.. మ్యాచింగ్ మెటీరియల్ కోసం మరికొందరు రైతులు నిరీక్షిస్తున్నారు.
ఇలా రెండు విధాలా అన్నదాతలకు కష్టం.. నష్టం వచ్చిపడింది.
(మదనపల్లె, ఆంధ్రజ్యోతి)
సాధారణంగా 25 కేవీ ట్రాన్స్‌ఫార్మరు ధర రూ.70 వేలు. వైసీపీ హయాంలో టెండరు ఖరారైంది రూ.1.60 లక్షలకు. అంటే రూ.90 వేలు అధికం. మ్యాచింగ్ మెటీరియల్‌కూ అధిక ధరలకే కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఈ అదనపు సొమ్మును కమీషన్ల రూపంలో పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ టెండరు దక్కించుకున్న సంస్థ కడపకు చెందిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్. ఇది వైసీపీ పెద్దలకు బినామీగా ప్రచారం జరిగింది. అవసరమున్నా లేకున్నా ఐదేళ్లలో ట్రాన్స్‌ఫార్మర్లను ఇబ్బడిముబ్బడిగా ఆయా విద్యుత్తు స్టోర్లు, సెక్షన్లలో దింపేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో రైతులకు ఇవ్వాల్సిన కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లను కొందరు వైసీపీ నాయకులు తీసుకెళ్లి బయట అమ్మేశారు. ఇలా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ అధికారులు వాటిని సరిచేయలేకపోతున్నారు. ఇలా 2019-24 మధ్య కాలంలో వైసీపీ చేసిన పాపాలు.. ఇప్పటికీ రైతులకు షాక్ కొడుతున్నాయి. ఎందుకంటే.. అప్పుడొచ్చిన కరెంటు సామగ్రిని ఇప్పుడు ఆ ధరలకే కొనాల్సి రావడం అన్నదాతలకు భారంగా మారింది.
‘కూటమి’లో టెండరుకు బ్రేక్!
కూటమి ప్రభుత్వం వచ్చినా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మ్యాచింగ్ మెటీరియల్ సరఫరాకు కాంట్రాక్టర్లు గతంలోలాగే అధిక ధరలనే కోట్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే షిరిడీసాయి కంపెనీపై అవినీతి ఆరోపణలు రావడం, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టెండర్లకు బ్రేక్ పడినట్లు తెలిసింది. ఐదేళ్లలో ఆ కంపెనీ సరఫరా చేసిన డీటీఆర్(డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్)లు ఎన్ని? సాధారణ ధర ఎంత? కోట్ చేసిన ధర ఎంత? చెల్లింపులు, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. మ్యాచింగ్ మెటీరియల్‌పైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ తేల్చాకే సామగ్రి సరఫరాకు అనుమతివ్వాలని, అంతవరకూ ఆయా స్టోర్లలో అందుబాటులో ఉన్న స్టాకును సర్దుబాటు చేసుకోవాలని విద్యుత్తుశాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో సదరన్ డిస్కం పరిధిలోని ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం సామగ్రి సరఫరా ఆగింది.
రైతులకు విద్యుత్ సామగ్రి కొరత
వ్యవసాయానికి సంబంధించి విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, ఎక్సిఫీజ్, ఎల్‌టీ ఫీజ్ సెట్, కండెక్టర్, నెట్, బోల్టు, క్రాసారాలు, ఎర్త్‌పైపులు, ఫీజు క్యారీయర్లు, కేబుల్ తదితర మ్యాచింగ్ మెటీరియల్ ఉంటాయి. అన్నీ ఒకేసారి రాకపోవడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉంటున్నాయి. కొందరు రైతులు స్తంభాలు నాటుకుని వైరుకోసం చూస్తుంటే.. మరికొందరు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకుని మిగిలిన సామగ్రికోసం ఎదురు చూస్తున్నారు. రైతుకు మంజూరైన అన్ని వస్తువులనూ స్టోర్ నుంచి ఏఈ డ్రా చేసి కాంట్రాక్టర్‌కు ఇస్తేనే క్షేత్రస్థాయిలో పని జరుగుతుంది. సామగ్రి లేకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు మానేశారు. దీంతో రైతులే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.