తొలుత తిరుపతి.. ఆఖరున సూళ్లూరుపేట
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:55 AM
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. జిల్లాలో 807 పంచాయతీలున్నాయి. వీటిల్లో కోర్టు పరిధిలో రెండు ఉండగా, 805 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 7,472 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడతలో తిరుపతి డివిజన్లోని 251 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 17వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
నవంబరు 17 నుంచి పల్లెపోరుకు నామినేషన్ల స్వీకరణ
805 సర్పంచ్, 7472 వార్డుసభ్యుల రిజర్వేషన్ల ఖరారు
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. జిల్లాలో 807 పంచాయతీలున్నాయి. వీటిల్లో కోర్టు పరిధిలో రెండు ఉండగా, 805 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 7,472 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడతలో తిరుపతి డివిజన్లోని 251 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 17వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న పోలింగ్, ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని 305 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 20న నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. మూడో విడత సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబరు 2న పోలింగ్ నిర్వహించి.. ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. కలెక్టర్ వెంటేశ్వర్ పర్యవేక్షణలో డీపీవో సుశీలాదేవి ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల వివరాలు
805 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీ జనరల్ 48, మహిళలకు 25 మొత్తం కలిపి 73 స్థానాలు, ఎస్సీ జనరల్ 119, మహిళలకు 110 కలిపి మొత్తం 229 స్థానాలు, బీసీ జనరల్ 43. మహిళలకు 51మొత్తం కలిపి 94స్థానాలు, ఇతర కేటగిరీలకు జనరల్ స్థానాలు 201, మహిళలకు 208 కలిపి మొత్తం 409 స్థానాలు ఖరారుచేశారు.
వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల వివరాలు
7,472 వార్డు సభ్యుల స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీ జనరల్ 443, మహిళలకు 234 మొత్తం 677 స్థానాలు.. ఎస్సీ జనరల్ 996, మహిళలకు 948 మొత్తం 1,944 స్థానాలు.. బీసీ జనరల్ 499, మహిళలకు 537 మొత్తం 1,036 స్థానాలు.. ఇతర కేటగిరీలో జనరల్ స్థానాలు 1,794, మహిళలకు 2,021 మొత్తం 3,815 స్థానాలు ఖరారు చేశారు.