శ్రీనిధికి కోపమొచ్చింది..!
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:41 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన ఏనుగు శ్రీనిధికి కోపమొచ్చింది. తన మావటిపైనా దాడిచేసింది. తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది. ఈ సంఘటనతో తిరుచానూరులో కలకలం రేగింది.
మావటిపైనే దాడిచేసిన ఏనుగు
తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది
భయంతో పరుగులు తీసిన భక్తులు
తిరుచానూరులో కలకలం
తిరుచానూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన ఏనుగు శ్రీనిధికి కోపమొచ్చింది. తన మావటిపైనా దాడిచేసింది. తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది. ఈ సంఘటనతో తిరుచానూరులో కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి. అమ్మవారి వాహన మండపంలో జరిగే ఊంజల్ సేవలో భాగంగా.. గజశాల నుంచి శ్రీనిధి, అవనిజ అనే ఏనుగులను మావటిలు ఆలయం వద్దకు తీసుకొస్తుంటారు. ఆదివారం సాయంత్రం కూడా ఊంజల్ సేవలో భాగంగా సాయంత్రం 5.15గంటల సమయంలో మూడో నెంబరు గేటు నుంచి ఈ రెండు ఏనుగులను తీసుకొస్తున్నారు. అమ్మవారి రథం సమీపంలో గేటు తీస్తున్న గోశాలలో పనిచేసే రవిని ఏనుగు (శ్రీనిధి) తొండంతో కొట్టింది. గమనించిన మావటి చంద్రశేఖర్ దోటి(అంకుశం)తో దానిని నియంత్రించబోయాడు. ఆగ్రహించిన ఆ ఏనుగు ఘీంకరిస్తూ మావటిపైనే దాడికి దిగింది. తొండంతో కొట్టి.. కింద పడేసి అతడి ఛాతీపై తొక్కింది. అతను అక్కడికక్కడే రక్తం కక్కుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పక్కనే ఉన్న మరో ఏనుగు మావటి చిన్నప్పరెడ్డి, మరికొందరు మావటిలు శ్రీనిధిని కట్టడి చేసి.. కాళ్లను గొలుసులతో బంధించారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేసి.. స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఏనుగు ఘీంకారంతోపాటు జరిగిన సంఘటనను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. ఏనుగును బంధించారని తెలిశాక ఊపిరిపీల్చుకున్నారు.
తప్పిన పెనుప్రమాదం
మావటిలు అప్రమత్తమై ఏనుగును కట్టడి చేయగలిగారు. లేదంటే అది అక్కడున్న భక్తులపైకి వెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేది.
గజశాలలో శాంతింపజేశారు
ఆలయం వద్ద నుంచి శ్రీనిధిని గజశాలకు తరలించారు. అక్కడ దానిపై నీటిని చిమ్మి శాంతింపజేశారు. తర్వాత ఆహారం తినిపించడంతో యథాస్థితిలోకి వచ్చిందని మావటిలు తెలిపారు.
ఎంతో స్నేహపూర్వకంగా ఉండేది
సుమారుగా 19 ఏళ్లుగా ఈ ఏనుగు అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో సేవలందిస్తోంది. నిత్యం మావటిలతో స్నేహపూర్వకంగా ఉండే శ్రీనిధి ఎందుకిలా ప్రవర్తించిందో అర్థం కావడం లేదని మావటిలు చెబుతున్నారు.
గత ఏడాది బ్రహ్మోత్సవాల్లోనూ..
గత ఏడాది జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కూడా గంగుండ్ర మండపం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను చూసి ఇదే ఏనుగు భయంతో పరుగులు తీసింది. దీంతో వాహనసేవల్లో పాల్గొననీయకుండా గోశాలకు తీసుకెళ్లారు. ఈ ఘటన అప్పట్లోనూ కలకలం సృష్టించింది.
మావటి పరిస్థితి కొంత ఆందోళనకరం
- పరామర్శించిన టీటీడీ ఈవో, జేఈవో
తిరుపతి సెంట్రల్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మావటి చంద్రశేఖర్‌కు స్విమ్స్‌లో సీఎంవో డాక్టర్ భారతి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ పర్యవేక్షణలో నిపుణులైన వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మావటిని టీటీడీ ఈవో రవిచంద్ర, జేఈవో గోపీనాథ్ పరామర్శించారు. చంద్రశేఖర్ పరిస్థితిని చూసి భార్య జ్యోతి, తమ్ముడు గుణశేఖర్ విలపిస్తున్నారు. కాగా, మావటి ఛాతీపై ఏనుగు తొక్కడంతో కుడిపక్కనున్న ఎముకలు విరిగిపోయాయని డాక్టర్ భారతి తెలిపారు. ప్రస్తుతం మావటి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందన్నారు.
తిరగబడే స్వభావం ఉందని
నా భర్త చెప్పినా పట్టించుకోలేదు
ఏనుగు (శ్రీనిధి)కు తిరగబడే స్వభావం ఉందని నా భర్త మూడు నెలల నుంచి సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. నాభర్తకు ఏమైనా జరిగితే టీటీడీ అధికారులే బాధ్యత వహించాలి.
- మావటి చంద్రశేఖర్ భార్య జ్యోతి