తేమతో మొలకొత్తినా.. కరుణించని చినుకు
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:34 AM
వర్షం లేక ఎండిపోతున్న వైనం
మదనపల్లె, సెస్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా అంతటా వర్షాభావంతో వేరుశనగ సాగుకు రైతులు వెనుకడుగు వేసినా అడవి, కొండల నడుమ ఉన్న కొండమీదపల్లె రైతులు మాత్రం ఆశను వీడలేదు. యథావిధిగా ధైర్యంగా సాగు చేశారు. పంట పచ్చగా మారుతున్న సమయంలో ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. కళ్లముందే పంట ఎండిపోతుండటంతో వరుణుడి కరుణ కోసం వేచి చూస్తున్న వైనంపై ప్రత్యేక కథనం..
ఏటా జిల్లాలో వేల హెక్టార్లలో సాగయ్యే వేరుశనగ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి పదుల హెక్టార్లకే పరిమితం అయింది. అది కూడా మదనపల్లె మండలంలో ఎక్కడా సెంటు భూమిలో సాగు కాలేదు. ఈ ఖరీఫ్‌లో 52వేల హెక్టార్లలో వేరుశనగా సాగువుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సీజన్ ముగిసే జూలై 16 నాటికి కేవలం 15 హెక్టార్లు సాగైంది. మదనపల్లె మండలం మాలేపాడు, పెంచుపాడు, ఆవులపల్లె, కోళ్లబైలు, దొనబైలు, మిట్టామర్రి, తదితర గ్రామాలు అటవీ, ఎత్తయిన కొండలు, గుట్టల మధ్య ఉంటున్నాయి. ఎక్కడా వర్షాలు లేకున్నా, మరెక్కడా పంటలు పండకపోయినా ఇక్కడ మాత్రం రైతులు అన్ని రకాలు పంటలు సాగుచేస్తుంటారు. అది కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సాగు చేస్తున్నారు. ఈసారి అన్ని ఏరియాలను పక్కనపెడితే పెంచుపాడు పంచాయతీ కొండమీదపల్లె రైతులు మాత్రం ఎప్పటిలానే సాగుకు సాహసం చేశారు. బోరుబావి ఎరుగని 40 కుటుంబాలు ఉన్న కొండమీదపల్లెలో వ్యవసాయమే జీవనాధారం. వర్షమే ప్రాణాధారం. వారి ఆశలు, ఆకాంక్షలన్నీ వరుణదేవుడిపైనే. సీజన్ ప్రారంభంలో ఒక పదును వర్షం పడగా అందరికంటే ముందుగానే దుక్కులు సిద్ధం చేసుకున్న ఇక్కడి రైతులు సీజన్ మొదట్లోనే విత్తనాలు విత్తేసి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి తిరిగి ఆ స్థాయిలో చినుకు జాడలేదు. ఉన్న తేమతోనే మొలకెత్తిన విత్తనాలు అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మొక్కలయ్యాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల వాడిపోతూ, మరికొన్ని చోట్ల ఎండిపోతూ, ఇంకోచోట చావలేక బతకలేక బతుకీడుస్తున్నాయి. నిద్రలేవగానే వీటిని చూసిన సాధారణ, మధ్యతరగతి రైతుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. మొత్తం 25 ఎకరాలకుపైగా వేరుశనగ సాగుచేసి నష్టపోయారు.
ఇతర పంటలకూ స్వస్తి
వేరుశనగ అదును దాటిపోగానే టమోటా, పచ్చిమిరప, కంది, ఉలవలు, రాగులు, జొన్నలు, సామలు సాగు చేస్తుంటారు. అయితే ప్రాణాధారమైన వర్షం లేక ప్రధాన పంటే దెబ్బతినగా, మిగిలిన పంటలకు స్వస్తి చెప్పారు. పరిస్థితి ఇలా మారడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
ఎక్కడ పంటలు లేకపోయినా మేము మాత్రం సాగుచేస్తుంటాం. నా అనుభవంలో సీజన్‌లో వర్షాలు లేకపోవడం ఇప్పుడే చూస్తున్నా. మొదటి పదునులో మృగసిర కార్తెలో విత్తనాలు వేసేశాం. తర్వాత అయినా పడకపోతుందా అనుకునే ఇంట్లో విత్తనాలు మట్టిలో వేసేశాం. ఉన్న తేమతో విత్తనాలు అన్ని బాగా మొలిచిన తర్వాత తేమలేక వాడిపోతున్నాయి.
- కె.శ్రీరాములు
తృణధాన్యాల సాగూ లేదు
వేరుశనగ వేయగా మిగిలిన భూమిలో అన్ని రకాల పంటలు వేస్తుంటాం. రాగి, జొన్న, కంది, సామలు, టమోటా, మిరప, ఉలవలు వేయడానికి కూడా అవకాశం లేదు. వ్యవసాయ అధికారులు ఏడు రకాల ధాన్యాలు సబ్సిడీతో ఇచ్చారు. అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకోసారి పదును వానపడి ఉంటే పూత పట్టి, కొంచమైనా కాయలు కాచేవి. విత్తనం వేసిందే కానీ..తర్వాత చినుకు పడలేదు. ఇప్పుడు పడినా కొంతలో కొంత పంట వస్తుందని ఆశపడుతున్నాం.
- బి.చిన్నరెడ్డెప్ప