Share News

నేటినుంచే క్రీడా సందడి

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:43 AM

తిరుపతిలో సోమవారం నుంచి క్రీడా సందడి మొదలు కానుంది. అమరావతి చాంపియన్‌షి్‌ప 2.0 క్రీడాపోటీలు తిరుపతి కేంద్రంగా నిర్వహించనుండటమే దీనికి కారణం.

నేటినుంచే క్రీడా సందడి
ప్రారంభ వేడుకలకు ముస్తాబైన ఎస్వీయూ మైదానం

- ‘అమరావతి చాంపియన్‌షి్‌ప’కు తిరుపతిలో పూర్తయిన ఏర్పాట్లు

- 9,911 మంది క్రీడాకారుల రాక

తిరుపతి అర్బన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం నుంచి క్రీడా సందడి మొదలు కానుంది. అమరావతి చాంపియన్‌షి్‌ప 2.0 క్రీడాపోటీలు తిరుపతి కేంద్రంగా నిర్వహించనుండటమే దీనికి కారణం. ఈ పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభ వేడుకల కోసం ఎస్వీయూ మైదానాన్ని ముస్తాబు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అలాగే ఎంపిక చేసిన మైదానాల్లో ఏర్పాట్లు పూర్తికావడంతో అవన్నీ కళకళలాడుతున్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా బసతోపాటు నాణ్యమైన ఆహారం, తాగునీరు, వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 27వ తేదీవరకు జరగనున్న ఈ పోటీల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మైదానాలు మినహా బస కేంద్రాల వద్దకు తల్లిదండ్రులకు సైతం అనుమతి లేకుండా చర్యలు చేపట్టారు. ఇక పోటీలు పారదర్శకంగా నిర్వహించాలని శ్రీనివాసా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఉన్న పీడీలు, పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులకు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏషియన్‌, వరల్డ్‌ రికార్డులు సృష్టించాలని శాప్‌ ఆశిస్తోందని చెప్పారు. అలాగే సాయంత్రం వంటలు తయారు చేసే నిర్వాహకులకూ పలు సూచనలిచ్చారు. శుచి, రుచిలో రాజీలేకుండా వంటలు తయారు చేయాలని ఆదేశించారు.

9వేదికల్లో 12 క్రీడాంశాలు

ఫ ఎస్వీ క్యాంప్‌స్కూల్‌ మైదానంలో.. ఆర్చరీ, వాలీబాల్‌ ఫ ఎస్వీయూ మైదానంలో.. అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, ఖోఖో, హాకీ, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ ఫ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇండోర్‌ హాల్‌, గ్రౌండ్‌లో.. బ్యాడ్మింటన్‌, చెస్‌, కబడ్డీ, ఖోఖో, యోగా ఫ శ్రీనివాస క్రీడా సముదాయంలో.. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కబడ్డీ ఫ ఎస్వీ వెటర్నరీ మైదానంలో.. బాస్కెట్‌బాల్‌ ఫ ఎస్వీ ఆర్ట్స్‌కాలేజీ గ్రౌండ్‌లో.. హాకీ ఫ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో.. చదరంగం, యోగా ఫ ఎస్వీయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో.. వెయిట్‌లిఫ్టింగ్‌ ఫ అవిలాల ఆర్స్‌కిడ్‌ బాక్సింగ్‌క్లబ్‌లో.. బాక్సింగ్‌ పోటీలు జరగనున్నాయి.

క్రీడాకారులు, సిబ్బంది

26జిల్లాల నుంచి పోటీలకు 9,911మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్‌-17 విభాగంలో బాలురు 2,748మంది, బాలికలు 2,676 మంది, అండర్‌-23 విభాగంలో 2,518 మంది బాలురు, 1,969మంది బాలికలు వివిధ పోటీల్లో తలపడనున్నారు. వీరికోసం దాదాపు 4వేల మంది కోచ్‌, మేనేజర్‌, గ్రౌండ్‌స్టాఫ్‌, పీడీ, పీఈటీ, రెఫరీలు ఉంటారు.

హైస్కూల్‌ విద్యార్థులకు అనుమతి

పోటీలను వీక్షించడానికి నాలుగు రోజులపాటు పలు మైదానాలకు నగర పరిధిలోని హైస్కూల్‌ విద్యార్థులను అనుమతించనున్నారు. మానసికోల్లాసం, ఒత్తిడిని అధికమించడానికి ఇది చక్కటి పరిష్కారంగా ఉంటుందని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని డీవీవో కుమార్‌ను శాప్‌ చైర్మన్‌ కోరారు.

Updated Date - Aug 24 , 2026 | 12:43 AM