Share News

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - May 23 , 2026 | 12:57 AM

కోట్లాది రూపాయల స్మార్ట్‌ సిటీ నిధులతో తిరుపతి నడిబొడ్డున నిర్మించిన మల్టీ స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు

 అసాంఘిక కార్యకలాపాలకు  అడ్డాగా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

(తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి)

కోట్లాది రూపాయల స్మార్ట్‌ సిటీ నిధులతో తిరుపతి నడిబొడ్డున నిర్మించిన మల్టీ స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాత్రం మారిపోతోంది.ఇందిరా మైదాన ప్రాంగణంలో రూ8.8కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 2024 డిసెంబరు 5న ప్రారంభమైంది. తిరుపతి నగరపాలక సంస్థ టెండరు ద్వారా నెలకు దాదాపు రూ1.5లక్షల అద్దెతో కేటాయింపులు కూడా చేశారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ దక్కించుకున్న హక్కుదారు సరైన వసతులు లేవంటూ కార్పొరేషన్‌కు లేఖ రాసి స్వాధీనం చేసుకోకుండా చేతులెత్తేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల కార్పొరేషన్‌కు దాదాపు రూ25 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. విజిల్‌ సౌండ్‌లు, క్రీడాకారుల కేరింతలతో సందడి చేయాల్సిన స్టేడియం చీకటిపడితే గంజాయి బ్యాచ్‌కు, మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. శుక్రవారం ఆంద్రజ్యోతి బృందం పరిశీలనకు వెళ్లినప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద శవమై కనిపించాడు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో తప్పతాగి వడదెబ్బతో చనిపోయినట్టు ప్రాధమికంగా నిర్థారించారు. అతని పక్కనే దుర్గంధమైన ఓ కుక్క కళేబరం కనిపించింది. స్టేడియం చుట్టూ మద్యం సీసాలే దర్శనమిచ్చాయి.ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు స్పందించాల్సి వుంది.టెండరు దక్కించుకున్న వ్యక్తి తీసుకోకపోతే రద్దు చేసి కొత్తగా టెండరు పిలిచి కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Updated Date - May 23 , 2026 | 12:57 AM