Share News

స్పీడ్‌ 130

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:39 AM

కారు వెళుతున్న వేగం 130 కిలోమీటర్లు. ముందు వెళుతున్న లారీ వేగం వందలోపే ఉన్నట్లు అంచనా. ఇక, లారీని కారు ఢీకొనే సమయంలో బ్రేక్‌ వాడలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రమాదం తర్వాత ఆగిన స్పీడోమీటరు స్పష్టంచేస్తోంది.

స్పీడ్‌ 130
లారీకింద చిక్కుకున్న కారును ఎక్స్‌కవేటర్‌తో బయటకు తీస్తున్న సిబ్బంది

రన్నింగ్‌ లారీని అతివేగంతో వెనకనుంచి ఢీకొన్న కారు

సగం వరకు లారీ కిందకు దూసుకెళ్లడంతో ఐదుగురి దుర్మరణం

బెంగళూరు నుంచి తిరుమలకు వెళుతుండగా ప్రమాదం

మృతులది ఒకే కుటుంబం

కారు వెళుతున్న వేగం 130 కిలోమీటర్లు. ముందు వెళుతున్న లారీ వేగం వందలోపే ఉన్నట్లు అంచనా. ఇక, లారీని కారు ఢీకొనే సమయంలో బ్రేక్‌ వాడలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రమాదం తర్వాత ఆగిన స్పీడోమీటరు స్పష్టంచేస్తోంది. దీన్నంతా పరిశీలిస్తే.. ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి కునుకు తీసినందున బ్రేక్‌ వేసుండరని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో కారు సగం వరకు లారీ కిందకు వెళ్లడంతో.. అందులోని ఐదుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

- గంగవరం, ఆంధ్రజ్యోతి

కుసుమ (61), జయంతి(59) అక్కా చెల్లెళ్లు. అక్క భర్త మోహన్‌దా్‌స(74) బెంగళూరులోని ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో మేనేజరు. చెల్లెలి భర్త నాగరాజరావు (68) బళ్లారి జిల్లా ఇండస్ట్రియల్‌ కమిటీ డైరెక్టరుగా పదవీ విరమణ పొందారు. జయంతి, నాగరాజరావు దంపతుల కుమార్తె పూజ(33). ఏడేళ్ల కిందట శివమొగ్గలోని నిఖిల్‌తో ఈమెకు వివాహమైంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా బెంగళూరులో ఉంటోంది. వీరంతా బెంగళూరులోని రాజాజినగర్‌లో ఉంటున్నారు. వీరు తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆరాధ్యదైవంగా భావిస్తారు. రెండు నెలలకు ఒకసారి శ్రీవారిని దర్శించుకోవడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట ఆన్‌లైన్‌లో మార్చి 5వ తేదీ (గురువారం) దర్శనానికి స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. బుధవారం తిరుమలలో నిద్రించి ఉదయం స్వామిని దర్శించుకోవాలని ప్లాన్‌ వేసుకున్నారు. అలా ఈ ఐదుగురూ కారులో బుధవారం ఉదయం తిరుమలకు వెళ్లే క్రమంలో గంగవరం మండలం దండపల్లె జంక్షన్‌ వద్ద రన్నింగ్‌ లారీని వెనకనుంచి ఢీకొంది.

రెండు గంటల పాటు శ్రమించి..

స్థానికుల సమాచారంతో ఎంవీఐ మధుసూదన్‌, పలమనేరు, గంగవరం సీఐలు రాంభూపాల్‌, పరశురామ్‌, మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ లోకే్‌షరెడ్డి, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కారులోని ఐదుగురూ మృతిచెందినట్లు గుర్తించారు. లారీ కింద సగం వరకు కారు వెళ్లి లాక్‌ కావడంతో మృతదేహాలను బయటకు తీయలేని పరిస్థితి. ఎక్స్‌కవేటర్లను రప్పించి రెండు గంటల పాటు శ్రమించి కారును వెలుపలకు తీశారు. కుసుమ, జయంతి, మోహనదాస్‌, నాగరాజరావు, పూజల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంభూపాల్‌ తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబీకులు, బంధువులు పలమనేరులోని ఆస్పత్రికి చేరుకుని రోదించారు. దేవుడా.. ఇదేమి అన్యాయం అంటూ విలపించారు.

మృతదేహాల తరలింపు

పలమనేరు ఆర్డీవో భవాని, తహసీల్దారు ఇన్బనాథన్‌ ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల బంధువులను ఓదార్చారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్సులలో పూజ మృతదేహాన్ని శివమొగ్గకు, మిగిలిన నలుగురి మృతదేహాలను బెంగళూరులోని రాజాజీనగర్‌కు తరలించారు.

ఎమ్మెల్యే తీవ్ర దిగ్ర్భాంతి

అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రమాద విషయం తెలియగానే పోలీసు, రవాణాశాఖ అధికారులకు ఫోన్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీశారు. ఐదుగురి దుర్మరణం చాలా బాధాకరమని, తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

ఆ స్పీడ్‌ను కారు తట్టుకోలేదు

అర గంట ముందు టిఫిన్‌ చేశారు. కునుకు తీసినట్లు ఉన్నారు. బ్రేక్‌ వాడలేదు. దీంతో 50 శాతం కారు లారీ వెనక లోపలకు వెళ్లిపోయింది. 130 కిలోమీటర్ల స్పీడ్‌ అనేది ఆ చిన్న కారు తట్టుకోలేదు. కర్ణాటక రాష్ట్రం వాళ్లవే అతివేగం కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులు కూడా అతి వేగంగా వెళతాయి. అది సిమెంట్‌ రోడ్డు కావడంతో వాహనానికి గ్రిప్‌ లేదు.

- నిరంజన్‌ రెడ్డి, డీటీసీ, చిత్తూరు

ఎప్పుడు.. ఏం జరిగింది?

బుధవారం ఉదయం 6 గంటలు: బెంగళూరులోని ఇంటి నుంచి ఐదుగురు కారు (కేఏ02ఎమ్‌ఎన్‌7132)లో బయలుదేరారు. నాగరాజరావు డ్రైవింగ్‌.

8 గంటలు: ముళబాగిల్‌లో టిఫిన్‌ చేశారు. ఆ సమయంలో ఇంట్లో వాళ్లకు వీడియో కాల్‌ చేశారు. టిఫిన్‌ తింటున్నామంటూ సంతోషంగా మాట్లాడారు.

9.05 గంటలు: వీరి కారు గంగవరం బైపా్‌సరోడ్డులో నాగమంగళం గ్రామం దాటి.. దండపల్లె జంక్షన్‌ సమీపానికి చేరింది. ఆ సమయంలో నెల్లూరు వైపు ఖాళీ సిమెంట్‌లారీ వెళుతోంది. వేగంగా వస్తున్న కారు ఆ లారీని వెనకనుంచి ఢీకొంది.

9.06 గంటలు: ఏదో వాహనం ఢీకొన్నట్లుందని లారీ డ్రైవరు వెనక్కి చూశారు. వాహనమేదీ కనిపించలేదు. సుమారు వంద మీటర్లు ముందుకువెళుతూ రోడ్డు పక్కన లారీ ఆపారు.

9.07 గంటలు: పెద్దగా కేకలు వేస్తూ స్థానికులు హైవేపైకి పరుగు తీశారు. లారీ డ్రైవరు కిందకు దిగి చూడగా కారు ఇరుక్కుని పోయి ఉంది.

Updated Date - Mar 05 , 2026 | 12:40 AM