నేటితో ముగియనున్న సర్ మ్యాపింగ్ స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:28 AM
: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కొందరికి అపోహలు ఉన్నాయి. 2002లో ఓటు ఉంటే అప్పటి చిరునామాను ఇప్పుడు ధ్రువీకరించుకోకుంటే జాబితా నుంచి ఓటు తొలగిపోతుందని భయపడుతున్నారు. అవగాహనతో మెలిగితే ఎలాంటి సమస్య ఉండదు. సర్ సర్వే ప్రారంభించడానికి ముందు పాత ఓటర్ల జాబితాను స్తంభింపచేస్తారు. దేశంలో ఎక్కడైనా ఒకచోట ఓటుహక్కు ఉండవచ్చు. ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్‌తో అవి తొలగిపోతాయి. అందుకే ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉండాలో అక్కడి జాబితాలో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కొందరికి అపోహలు ఉన్నాయి. 2002లో ఓటు ఉంటే అప్పటి చిరునామాను ఇప్పుడు ధ్రువీకరించుకోకుంటే జాబితా నుంచి ఓటు తొలగిపోతుందని భయపడుతున్నారు. అవగాహనతో మెలిగితే ఎలాంటి సమస్య ఉండదు. సర్ సర్వే ప్రారంభించడానికి ముందు పాత ఓటర్ల జాబితాను స్తంభింపచేస్తారు. దేశంలో ఎక్కడైనా ఒకచోట ఓటుహక్కు ఉండవచ్చు. ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్‌తో అవి తొలగిపోతాయి. అందుకే ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉండాలో అక్కడి జాబితాలో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి. వివరాల అప్డేట్, నకిలీ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేరిక, తప్పుల సవరణ సర్‌లో ప్రధానమైంది.
తహసీల్దార్ల పర్యవేక్షణ
పారదర్శకమైన, కచ్చితమైన తప్పుల్లేని ఓటరుజాబితాను రూపకపల్పకు ఉద్దేశించిన సర్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. శని, ఆదివారాల్లో బీఎల్వోలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల్లో అందుబాటులో ఉంటారు. ఓటరు మ్యాపింగ్ చేయడంతో పాటు ప్రచారం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 1776 పోలింగ్ బూత్‌ల్లో ఏర్పాట్లు చేశారు. సమగ్ర సవరణపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రత్యేక డ్రైవ్ శని, ఆదివారాల్లో జిల్లావ్యాప్తంగా జరుగుతోంది. 2002లో జిల్లాలో 13,24,150 మంది ఉండగా, ప్రస్తుతం 15,76,222 మంది ఓటర్లు ఉన్నారు. పాత, ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయనున్నారు. ఈనెల 15వ తేదికి ముందుగానే మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేయాలన్నది ఎన్నికల సంఘం ఆదేశం. బీఎల్వోలు రెండ్రోజులపాటు మ్యాపింగ్ కార్యక్రమంపైనే దృష్టి సారించాలని ఇదివరకే కలెక్టర్ సుమిత్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీఎల్వోలు బాధ్యతగా పనిచేసేలా ఆయా మండలాల తహసీల్దార్లు శని, ఆదివారాల్లో బీఎల్వోల వెంట గ్రామాల్లో తిరుగుతూ వారందరూ బాధ్యతగా పనిచేసేవిధంగా పర్యవేక్షిస్తున్నారు.