ఎస్సీ, ఎస్టీల సమస్యలపై స్పెషల్ గ్రీవెన్సు : కలెక్టర్
ABN , Publish Date - Apr 15 , 2026 | 02:02 AM
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆదర్శాలతో ఓవైపు ప్రజల సంక్షేమం, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రెండేళ్లుగా సంక్షేమం, సంకల్పం అనే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిచడం జరిగిందన్నారు. సీఎ్‌సఆర్ నిధులు రూ.30కోట్లతో సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. చంద్రగిరిలో రూ.3కోటట్లతో సాంఘిక సంక్షేమ వసతిగృహం నిర్మాణానికి పనులు మొదలయ్యాయని, తిరుపతిలో ఎస్పీ బాలుర వసతిగృహం మంజూరైందని వివరించారు. ఇక జిల్లాలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తుండటం జరుగుతోందన్నారు. మంగళం వద్ద అంబేడ్కర్ భవన నిర్మాణానికి 1.15ఎకరాలు గుర్తించడం జరిగిందని, త్వరలోనే అక్కడ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు, టీటీడీపాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సుగుణమ్మ, నరసింహయాదవ్, రుద్రకోటి సదాశివం తదితరులు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో జేసీ గోవిందరావు, కుమారమ్మ, పరసారత్నం, ఆర్డీవో రామ్మోహన్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.