Share News

ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ సరళతరం

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:40 AM

ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ ఆదేశించారు. తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో బుధవారం సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

 ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ సరళతరం

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులు వేగవంతం:సీఎండీ

తిరుపతి సిటీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ ఆదేశించారు. తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో బుధవారం సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులతో పాటు గృహ విద్యుత్‌ సర్వీసులకు, ఫీడర్లకు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు కలిపి మొత్తం 10.50 లక్షల స్మార్ట్‌ మీటర్లను అమర్చామన్నారు. స్మార్ట్‌ మీటర్ల ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం, పొదుపు, బిల్లులో ఆదా చేసుకునేందుకు అవకాశం వుంటుందని వివరించారు. సంస్థ పరిధిలో విద్యుత్‌ వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్న మొబైల్‌ అప్లికేషన్‌ను సరళతరం చేశామని తెలిపారు. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు బిల్లుల చెల్లింపు, పేమెంట్‌ వివరాలను తెలుసుకోవడంతో పాటు కొత్త సర్వీసులకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కూడా వుందన్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌తో పాటు ఐఫోన్‌ వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

ఫ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతం

ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటికే మంజూరైన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణంలో పరికరాల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు అయూబ్‌ ఖాన్‌, గురవయ్య, కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, సిహెచ్‌ రామచంద్ర రావు, కె.సంపత్‌ కుమార్‌, ఎస్‌.రమణ, శ్రీనివాసులు, జగదీష్‌, లత, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:40 AM