జీడీ నెల్లూరు ఘటనపై ఎస్పీ సీరియస్
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:54 AM
గంగాధరనెల్లూరులో ఓ ఎంపీటీసీ అభ్యర్థి నుంచి నామినేషన్ పత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తి నుంచి మహిళకు రక్షణ కల్పించలేదన్న కారణంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
నగరి డీఎస్పీకి షోకాజ్ నోటీసు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గంగాధరనెల్లూరులో ఓ ఎంపీటీసీ అభ్యర్థి నుంచి నామినేషన్ పత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తి నుంచి మహిళకు రక్షణ కల్పించలేదన్న కారణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని నగరి డీఎస్పీ చంద్రశేఖర్‌కు షోకాజ్ నోటీసులిచ్చారు. అక్కడే ఉన్న సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ మురుగేశ్‌లకు చార్జిమెమోలను ఇచ్చారు. అభ్యర్థి వద్ద నామినేషన్ పత్రాన్ని లాక్కోవడానికి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అక్కడే ఉండి కూడా అడ్డుకోలేకపోయిన ఏఎ్‌సఐ, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై చట్టపరిధిలో ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆధారాల సహ ఉన్నతాధికారులకు ఎస్పీ తుషార్ డూడీ నివేదికలు పంపారు.
ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ నుంచి నామినేషన్ పత్రాన్ని లాక్కొవడానికి ప్రయత్నించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి ఓ మహిళ వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టుకుని విచారించారు. ఈ ఘటనపై జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.