Share News

ఎక్కడో జరిగింది పొరపాటు!

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:15 AM

పొరబాటు ఎక్కడో జరిగింది. దాని ఫలితం చిత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం తాత్కాలికంగా స్టాంపు పేపర్ల విక్రయాలు ఆగిపోయాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎటువంటి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ జరగాలన్నా స్టాంపు పేపర్లు తప్పనిసరి.

ఎక్కడో జరిగింది పొరపాటు!

చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఆగిన స్టాంప్‌ పేపర్ల విక్రయాలు

క్రయ విక్రయదారులకు ఇబ్బందులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): పొరబాటు ఎక్కడో జరిగింది. దాని ఫలితం చిత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం తాత్కాలికంగా స్టాంపు పేపర్ల విక్రయాలు ఆగిపోయాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎటువంటి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ జరగాలన్నా స్టాంపు పేపర్లు తప్పనిసరి. వివిధ డినామినేషన్లలో ఉండే రిజిస్ట్రేషన్‌ స్టాంపులు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తప్ప మరెక్కడా లభించవు. స్టాంపు వెండర్ల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో చిత్తూరు ఆర్వో సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో స్టాంపుల కౌంటర్‌లో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ అశ్విని 10 రోజుల క్రితం అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఆమె స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రేణుకను ఇన్‌చార్జిగా నియమించారు. ఈ 10రోజుల్లో స్టాంప్‌ పేపర్ల విక్రమాల సందర్భంగా ఆన్‌లైన్‌ మాడ్యూల్‌లో వివరాలు నమోదుచేసే అంశంలో ఆమె బాధ్యతారహితంగా వ్యవహరించారు. దాంతో వివిధ డినామినేషన్లతో కూడిన 241 స్టాంపు పేపర్లు విక్రయాలు జరగకనే అమ్మకాలు జరిగినట్లు ఆన్‌లైన్‌ మాడ్యూల్‌లో నమోదైంది. ఈ తప్పు సర్దుబాటు చేసేందుకు 10 రోజులుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, సెలవులో వెళ్లిన జూనియర్‌ అసిస్టెంట్‌ సోమవారం విధులకు హాజరయ్యారు. మార్కెట్‌ వేల్యూ, ఆడిట్‌, జిల్లా రిజిస్ట్రార్‌ సూచనల మేర గల్లంతైన 241 స్టాంపు పేపర్ల విక్రయాలపై ఇంటర్నల్‌ ఆడిట్‌ చేపట్టారు. దీంతో సోమవారం స్టాంపులు, స్టాంపు పేపర్ల విక్రయాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎక్కడో జరిగిన పొరపాటు క్రయవిక్రయదారులకు గ్రహపాటుగా మారింది. స్టాంపు పేపర్ల అమ్మకాలు లేదనడంతో పలువురు క్రయ విక్రయదారులు సమీప ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పరుగులు తీయగా, మరికొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకుని వెనుదిరిగారు.

Updated Date - Jun 02 , 2026 | 01:15 AM