వినియోగదారుడికి సోలార్ ‘షాక్’
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:23 AM
సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్‌శాఖ అధికారుల తీరుతో వినియోగదారులు నష్టపోతున్నారు.
యాదమరి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్‌శాఖ అధికారుల తీరుతో వినియోగదారులు నష్టపోతున్నారు. వారి నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల కారణంగా అదనపు భారం పడుతుండటంతో లబోదిబోమంటున్నారు. యాదమరి మండలం ఆరిమాకులపల్లెకు చెందిన ఓ వినియోగదారుడు గతేడాది అక్టోబరులో రూ.1.50 లక్షల వ్యయంతో ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వినియోగం పోనూ మిగిలింది గ్రిడ్‌కు చేరుతుంది. నిబంధనల ప్రకారం గ్రిడ్‌కు వెళ్లిన విద్యుత్‌ను మినహాయించి మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వేయాలి. కానీ ఈ వినియోగదారుడికి ఆరునెలలు గడుస్తున్నా ఎస్పీడీసీఎల్ సిబ్బంది ఆ కనెక్షన్‌ను సాఫ్ట్‌వేర్ లేదా సంబంధిత యాప్‌లో అప్‌డేట్ చేయలేదు. దీంతో సదరు వినియోగదారుడు గ్రిడ్‌కు పంపుతున్న విద్యుత్ లెక్కల్లోకి రావడం లేదు. మార్చినెలకు ఏకంగా రూ.10,339 బిల్లు రావడంతో దిగ్భ్రమ చెందాడు. యాప్‌లో వివరాలు నమోదు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని సిబ్బంది చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆ వినియోగదారుడు వాపోతున్నాడు.