Share News

మట్టి మాఫియా బరితెగింపు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:42 AM

కురబలకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రాత్రింబవళ్లు దర్జాగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటోంది.

మట్టి మాఫియా బరితెగింపు
అమ్మచెరువు మిట్ట సమీపంలో మట్టి తవ్వకాలు

కురబలకోట, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి) : మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రాత్రింబవళ్లు దర్జాగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇసుక, మట్టిని భారీ స్థాయిలో దోచుకున్నారు. చెరువులో మట్టి తోలుకోవడానికి వైసీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి రోజుకు రూ.25వేలు తీసుకుని అనధికారికంగా అనుమతి ఇచ్చేవారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటికి అడ్డుకట్ట పడుతుందని అందరూ భావించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కొన్ని రోజులు మౌనంగా ఉన్న మాఫియా మళ్లీ రెక్కలు విప్పుకుంది. తాజాగా నందిరెడ్డిగారిపల్లె పంచాయతీలోని అమ్మచెరువుమిట్ట సమీపంలో నాలుగు రోజులుగా కొండలు, గుట్టలు, చెరువులలో యథేచ్ఛగా తవ్వకాలు జరిపి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అంగళ్లు సమీపంలోని కుందేలు గుట్ట, గుర్రాలవారిపల్లె, రంగమ్మ చెరువు, కురబలకోట సమీపంలోని ఊరగుట,్ట తెట్టు సమీపంలో గుట్టల నుంచి భారీగా మట్టిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల భూములకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

నిబంధనలు గాలికి..

సాధారంగా చెరువులు, గుట్టలు, కొండల్లో తవ్వకాలు చేయాలంటే మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖాధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధనలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా రాజకీయ నేతల జోక్యంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్‌ చేసినా మాఫియా తీరులో ఏ మాత్రమూ మార్పు కనిపించడం లేదు.

అనుమతి లేకుంటే చర్యలు

మట్టి, ఇసుక తరలింపునకు అనుమతి తప్పనిసరి. అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మట్టిని తరలిస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి.

- ధనంజయ, తహసీల్దార్‌

Updated Date - Feb 09 , 2026 | 01:42 AM