అలా.. బరువులెత్తించారు!
ABN , Publish Date - May 22 , 2026 | 01:34 AM
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచే మంచి క్రీడాకారులను తయారు చేయాలని ఉద్దేశంతో శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తోంది. అవి క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలకు గురువారం చిత్తూరు మెసానికల్ మైదానం జరిగిన ఎంపిక పోటీలే నిదర్శనం. జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో.. సంబంధిత కోచ్‌లు లేకుండానే ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలైతే మరీ దారుణం.
స్టేడియం గ్యాలరీ మెట్లపై, జిమ్ పరికరాలతో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
కోచ్‌లు లేకుండానే వివిధ పోటీల ఎంపిక ప్రక్రియ పూర్తి
శాప్ లీగ్ పోటీలకు కనీస వసతులేవీ?
చిత్తూరు క్రీడలు, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచే మంచి క్రీడాకారులను తయారు చేయాలని ఉద్దేశంతో శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తోంది. అవి క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలకు గురువారం చిత్తూరు మెసానికల్ మైదానం జరిగిన ఎంపిక పోటీలే నిదర్శనం. జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో.. సంబంధిత కోచ్‌లు లేకుండానే ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలైతే మరీ దారుణం.
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించాలిలా
వెయిట్ లిఫ్టింగ్ పోటీలంటే కేవలం బరువు ఎత్తించడం మాత్రమే కాదు. భద్రత, మెడికల్ సపోర్ట్, సరైన పరికరాలు ముఖ్యం. సరైన జాగ్రతలు లేకపోతే గాయాలు, ఎముకలు విరగడం, వెన్నెముక సమస్యలు, గుండెపోటు వంటి ప్రమాదాలు జరగొచ్చు. ఈ పోటీలకు ప్రధానంగా మంచి ప్లాట్‌ఫామ్ తప్పనిసరి. అది బలమైన ఉడ్ లేదా రబ్బర్ ప్లాట్‌ఫామ్‌తో ఫాక్ అబ్జార్బింగ్ మెటీరియల్‌తో నిర్మించి ఉండాలి. వెయిట్ ప్లేట్లు అమర్చడానికి బారెబల్స్ (ఒలింపిక్ స్టాండర్డ్‌బార్), కాలర్స్ (వెయిట్ ప్లేట్లు అమర్చాక అవి బయటకు రాకుండా వాడే లాక్స్) తప్పని సరి. ఈ పోటీలపై అవగాహన ఉన్న కోచ్ లేదా నిపుణుల పర్యక్షణలో మాత్రమే నిర్వహించాలి. లేదంటే అథ్లెట్ తన సామర్థ్యానికి మించి బరువు ఎత్తే అవకాశం ఉంటుంది. దీంతో కండరాలు చీలిపోవడం, స్పృహ తప్పడం, శ్వాస సమస్యలు వంటివ తలెత్తవచ్చు. టెక్నికల్, మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. భారీ బరువులు ఎత్తే పోటీల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
ఇక్కడేం చేశారంటే..
ఎన్నో జాగ్రతలు, నిపుణుల మధ్య నిర్వహించాల్సిన ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ప్లాట్‌ఫామ్ ఏదంటే.. మెసానికల్ మైదానం గ్యాలరీలోని మెట్లే. ఇక, ఎంపిక పోటీలకు వాడేవి కాకుండా.. జిమ్‌లో వెయిట్ లిఫ్ట్ చేసే పరికరాలను వాడారు. ఈ పోటీలకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఈ పోటీలపై అవగాహన ఉన్న కోచ్‌లూ లేరు. ఇలాంటి వాతావరణంలో జరిగిన ఎంపిక పోటీల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. జిమ్‌లో వాడే.. రాష్ట్రస్థాయి పోటీలకు వినియోగించే వెయిట్ లిఫ్టింగ్ పరికరాలకు తేడా ఉంటుంది. అలాంటప్పుడు సరైన కోచ్‌లు, నిపుణులు, పరికరాలు లేకుండా జరిగిన పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు.. రాష్ట్రస్థాయిలో ఎలా పోటీ పడగలరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాప్ లీగ్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలే కావడం గమనార్హం.
జిల్లాలో ఇద్దరే కోచ్‌లు..!
జిల్లాలో సుమారు పదుల సంఖ్యలో క్రీడలుంటే.. రెజ్లింగ్.. ఫెన్సింగ్ క్రీడలకు మాత్రమే ఇద్దరు కోచ్‌లు ఉన్నారు. ఈ ఫెన్సింగ్ కోచ్‌నూ ఖేలో ఇండియా కింద తీసుకున్నారు. ఆయనకు కాణిపాకం హైస్కూల్‌లో పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడే పనిచేస్తున్నారు. అంటే జిల్లా కేంద్రంలో ఒక్కరే కోచ్ ఉన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు 40 మంది ఎంపిక
చిత్తూరు నగరంలోని మెసానికల్ మైదానంలో గురువారం శాప్ లీగ్ పేరుతో జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ అథ్లెటిక్స్‌లో భాగంగా రన్నింగ్, హైజంప్, జావలింగ్‌త్రో, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా సుమారు 120 మంది క్రీడాకారులు హాజరైనట్లు డీఎ్‌సడీవో ఉదయ్‌భాస్కర్ తెలిపారు. అందులో 40 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు.