కొత్తచట్టాలపై నైపుణ్యం అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:42 AM
‘పాత.. కొత్త చట్టాల మధ్య తేడాలను గ్రహించి నైపుణ్యాలను పెంచుకోవాలి. కొత్త చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలి’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయాధికారులకు ఏపీ హైకోర్టు న్యాయయూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య సూచించారు.
వర్క్‌షాపులో హైకోర్టు న్యాయమూర్తి జయసూర్య
చిత్తూరు లీగల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ‘పాత.. కొత్త చట్టాల మధ్య తేడాలను గ్రహించి నైపుణ్యాలను పెంచుకోవాలి. కొత్త చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలి’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయాధికారులకు ఏపీ హైకోర్టు న్యాయయూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య సూచించారు. చిత్తూరులోని జిల్లా కోర్టు సముదాయంలో శనివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు నిర్వహించిన వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు నేపథ్యంలో న్యాయమూర్తులు ఎదుర్కొనే సందిగ్ధాలను తొలగించేందుకు ఈ వర్క్‌షాపు ఉపయోగపడుతుందన్నారు. పాత, కొత్త చట్టాల మధ్య తేడాలను లోతుగా అధ్యయనం చేసి, వాటిని నిత్య న్యాయ కార్యక్రమాల్లో సరైన విధంగా అమలు చేయాలన్నారు. కొత్తగా నియమితులైన న్యాయాధికారులు ఈ మార్పులను అర్థం చేసుకుని, ఏ చట్టాన్ని ఎప్పుడు అమలు చేయాలో స్పష్టత పొందాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా అనుభవజ్ఞులైన న్యాయమూర్తులతో పరస్పర చర్చలు జరిపి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ‘చట్టాలపై స్పష్టమైన అవగాహనతో పాటు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. భయపడకుండా, ఆలోచనాత్మకంగా తీర్పులివ్వాలి. తుదినిర్ణయం ఉన్నత న్యాయస్థానాలదే అయినప్పటికీ, ప్రతి న్యాయాధికారి తన స్థాయిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు ఇవ్వడం ముఖ్యం. న్యాయాధికారుల నైపుణ్యాభివృద్ధికి వర్క్‌షా్‌పలు వేదికలు’ అని జస్టిస్ జయసూర్య వివరించారు. కొత్త చట్టాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి విరూపాక్ష దత్తాత్రేయ, అన్నయ్య రీసోర్సుపర్సన్లుగా పాల్గొన్నారు. కాగా, తొలుత జిల్లా కోర్టు వద్దకు వచ్చిన జస్టిస్ జయసూర్యకు పోలీసులు గౌరవ వందనం చేశారు. న్యాయమూర్తులు స్వాగతం పలికారు.