నేటి నుంచి ఆరో విడత రీసర్వే ప్రారంభం
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:34 AM
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 92 గ్రామాల్లో.. 1.6 లక్షల ఎకరాల్లో ఆరో విడత రీ సర్వే జరగనుంది. సోమవారం నుంచి ఈ భూముల రీసర్వే ప్రారంభించనున్నారు. దీనికోసం 3-4 రోజులుగా ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 92 గ్రామాల్లో.. 1.6 లక్షల ఎకరాల్లో ఆరో విడత రీ సర్వే జరగనుంది. సోమవారం నుంచి ఈ భూముల రీసర్వే ప్రారంభించనున్నారు. దీనికోసం 3-4 రోజులుగా ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామాల్లో భూముల కొలతల్లో వాస్తవికతను యజమానులకు తెలియజేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం రీసర్వేకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలివిడతగా గతేడాది జనవరిలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి సర్వే చేపట్టారు. అనంతరం ప్రతి మండలం నుంచి విడతలవారీగా రెండు లేదా మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని రీసర్వే చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రీ సర్వే జరగ్గా.. సోమవారం నుంచి ఆరో విడత మొదలు కానుంది. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో నలుగురు, ఐదుగురు రైతులకు కలిపి సంయుక్త ఎల్పీఎం నెంబరు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో భూవిస్తీర్ణంలో తేడాలు, ఉండాల్సిన విస్తీర్ణం లేకపోవడం, సరిహద్దు తేడాలు తదితర సమస్యలు ఎక్కువగా వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసమస్యలను తగ్గించాలన్న ఉద్దేశంతో రీసర్వే జరిగిన గ్రామాల్లో 2024 నవంబరులో గ్రామ సభలు నిర్వహించి, బాధిత రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. అయినా సగానికి పైగా అర్జీలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
రైతుల సమక్షంలోనే హద్దులు
రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. 200-250 ఎకరాలను ఒక బ్లాక్‌గా విభజించారు. ఈ బ్లాక్‌కు ఒక బృందం ఉంటుంది. బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్‌ఏ ఉంటారు. పొలాలగట్లు, విస్తీర్ణాన్ని పక్కాగా కొలుస్తారు. ఎక్కడికక్కడ గ్రామ ప్రజలు, భూయజమానుల సమక్షంలోనే రీసర్వే చేస్తారు. విస్తీర్ణం, రైతు వివరాలు, ప్రస్తుత భూయజమాని, సెటిల్‌మెంట్, టైటిల్‌డీడ్ వంటివి నిర్ధారణ చేయనున్నారు. ముందుగా సమాచారాన్ని ఆయా భూయజమానులకు తెలియజేసి వారి సమక్షంలోనే హద్దులు నిర్ధారిస్తారు. ఈ సర్వేను ఆగస్టు చివరినాటికి పూర్తిచేస్తామని జిల్లా భూసర్వే శాఖ ఏడీ పుల్లయ్య ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.