Share News

నకిలీ నోట్ల మార్పిడి కేసులో ఆరుగురి అరెస్టు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:43 AM

నకిలీ నోట్ల మార్పిడికి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

నకిలీ నోట్ల మార్పిడి కేసులో ఆరుగురి అరెస్టు
నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ మహేంద్ర

మదనపల్లె అర్బన్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): నకిలీ నోట్ల మార్పిడికి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు ముందస్తు సమాచారంతో నకిలీనోట్ల ముఠాకు చెందిన ఆరుగురిని కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రూ. 2లక్షల విలువైన నకిలీ నోట్లను, వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరు పరారయ్యారు. ఇందులో కర్ణాటక బెల్గామ్‌కు చెందిన మహమ్మద్‌ జుబేర్‌ మకందర్‌, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన మాణిక్య రెడ్డి, పీటర్‌, బోర్నపల్లెకు చెందిన సుమన్‌, సత్యసాయి జిల్లా పేరూర్‌కు చెందిన కుమ్మర వెంకటేష్‌, వాయల్పాడు మండలం గొల్లపల్లెకు చెందిన దాదిమి రమణప్పలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఏ-1 నిందితుడి నుంచి మహమ్మద్‌ జుబేర్‌ మకందర్‌ ద్వారా పాత నోట్లకు కొత్త నకిలీ నోట్లు రెండితలు ఇచ్చి మార్చేవారు. ఈ క్రమంలో మాణిక్యంరెడ్డి ఏ1ను పరిచయం చేసుకుని తనకు తెలిసిన మిత్రులను ఇందులో దింపాడు. మూడు నెలలుగా బెల్గామ్‌లో వీరి నోట్ల మార్పిడీ వ్యవహారం సాగుతోంది. నిందితులను పట్టుకున్న అధికారులు,సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jan 08 , 2026 | 12:43 AM