Share News

సిట్‌ కార్యాలయం త్వరలో ఖాళీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:19 AM

కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కోసం తిరుపతిలో ఏర్పాటైన సిట్‌ కార్యాలయం త్వరలో ఖాళీ అవనుంది.

 సిట్‌ కార్యాలయం త్వరలో ఖాళీ
తిరుపతిలో అలిపిరి వద్ద సిట్‌ కార్యాలయం నడుస్తున్న భూదేవి కాంప్లెక్సు

తిరుపతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కోసం తిరుపతిలో ఏర్పాటైన సిట్‌ కార్యాలయం త్వరలో ఖాళీ అవనుంది. దర్యాప్తు ముగిసిన నేపధ్యంలో ఇప్పటికే సీబీఐ, పోలీసు, ఫుడ్‌ సేఫ్టీ విభాగాలకు చెందిన అధికారులంతా తమ పూర్వ స్థానాలకు వెళ్ళిపోయారు. మిగిలిన సిబ్బంది ఫైళ్ళు, రికార్డుల విభజనలో నిమగ్నమై వున్నారు. కేసుకు సంబంధించిన ఫైళ్ళ సర్దుబాటు పూర్తి కాగానే వాటిని తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి సిబ్బంది కూడా విధుల నుంచీ రిలీవ్‌ కానున్నారు. ఈ క్రమంలో వారం పది రోజుల్లో సిట్‌ కార్యాలయం మూత పడనుంది.

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ 2024 సెప్టెంబరు 25వ తేదీన అప్పటి టీటీడీ మార్కెటింగ్‌ జీఎం పి.మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ ఏడాదిలోనే అక్టోబరు 4న సిట్‌ ఏర్పాటైంది. అదే ఏడాది నవంబరులో సీబీఐ, ఏపీ పోలీస్‌, సెంట్రల్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన బృందం తిరుపతి నుంచీ దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతిలో అలిపిరి సమీపాన టీటీడీకి చెందిన భూదేవి కాంప్లెక్సులో సిట్‌ కార్యాలయం కోసం గదులు కేటాయించారు. సిట్‌ బృందంతో పాటు దానికి దర్యాప్తులో సహకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక శాఖలకు చెందిన అధికారులను డెప్యుటేషన్‌పై నియమించాయి. అలాగే సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాయి. 2024 నవంబరు నుంచీ దర్యాప్తు ప్రారంభం కాగా దర్యాప్తు అధికారి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిందితుల వైపు కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో 2025 జూలై నుంచీ సెప్టెంబరు దాకా దర్యాప్తునకు బ్రేక్‌ పడింది. సుప్రీం కోర్టు జోక్యంతో తిరిగి మొదలైన దర్యాప్తు ఈ ఏడాది జనవరి దాకా కొనసాగింది. జనవరి 23న సిట్‌ నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జిషీటును కోర్టు పరిశీలించి ఏదైనా అంశంలో తదుపరి దర్యాప్తు అవసరమని ఆదేశిస్తే తప్ప ప్రస్తుతానికి దర్యాప్తు ముగిసినట్టే. దీంతో సిట్‌ బృందంలోని కీలక అధికారులు, బృందానికి సహకరించేందుకు నియమితులైన ఇతర అధికారులంతా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతం కిందిస్థాయి సహాయక సిబ్బంది మాత్రమే కార్యాలయంలో వున్నారు. కోర్టుకు ఛార్జిషీటు వెంట అవసరమైన రికార్డులన్నింటినీ సమర్పించేశారు. అవే ప్రతులను ఏపీపీ కోసం, దర్యాప్తు అధికారి (ఐఓ) కోసం రెండు సెట్లుగా విభజించాల్సి వుంది. అలాగే మొత్తం కేసు దర్యాప్తునకు సంబంధించిన ఫైళ్ళు, రికార్డులను ఒక సెట్‌ ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేర్చాల్సి వుంది. ప్రస్తుతం సిట్‌ కార్యాలయంలో ఆ పనే నడుస్తోంది. ఇదంతా వారం పదిరోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత కార్యాలయం ఖాళీ చేస్తారని సమాచారం.

Updated Date - Feb 03 , 2026 | 12:19 AM