ఈ ఒక్కరోజే.. సర్!
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:28 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మిగిలింది ఒక్క రోజే. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సాఫ్ట్‌వేర్ యాప్ ఫ్రీజ్ కానుంది. ఈలోగా మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో బూత్ లెవల్ ఆఫీసర్ల నుంచి మండలానికి నియమించిన జిల్లా అధికారుల్లో ఆందోళన మొదలైంది.
13,26,740 మంది ఓటర్ల డిజిటలైజేషన్
తొలగింపు ఖాతాలో 1,28,272 ఫారాలు
ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే చివరి రోజు
చిత్తూరు కలెక్టరేట్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మిగిలింది ఒక్క రోజే. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సాఫ్ట్‌వేర్ యాప్ ఫ్రీజ్ కానుంది. ఈలోగా మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో బూత్ లెవల్ ఆఫీసర్ల నుంచి మండలానికి నియమించిన జిల్లా అధికారుల్లో ఆందోళన మొదలైంది. దూర ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇతర జిల్లాల్లో నివాసం ఉంటున్న వారి నుంచి సమగ్ర సమాచారం రావడంలేదని, పత్రాలు కొంతమంది ఇవ్వకపోవడం బీఎల్వోలకు తలనొప్పిగా మారింది. కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం కొనసాగిన ప్రత్యేక శిబిరాలు మంగళవారంతో పూర్తికానున్నాయి. ఈ ప్రక్రియ కోసం అంగన్‌వాడీ కార్యకర్తల సాయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ ప్రక్రియపై అందరూ దృష్టిపెట్టారు. మంగళవారంలోగా 100శాతం పూర్తి చేసేందుకు కృషిచేయనున్నారు. ఈఆర్వోలు, స్పెషల్ ఆఫీసర్లు, ఏఈఆర్వోలు, ఇతర అధికారులందరూ వార్డు సచివాలయాల్లో ఉంటూ ఫారాల సేకరణ డిజిటలైజేషన్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 13,40,126 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 11,98,468 మంది డిజిటలైజేషన్ (89.43శాతం) పూర్తయ్యింది. మరణాలు, ఇతర ప్రాంతాలకు వలస, చిరునామాలందని తదితర కారణాలతో 1,28,272 మంది (9.57శాతం) తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది. వీటితో కలిపి 13,26,740 (99.0శాతం) డిజిటలైజేషన్ జరిగింది. ఇంక 13,386 ఫారాలే మిగిలి ఉన్నాయి. మంగళవారం ఉదయం లేదా మధ్యాహ్నానికి ఇవి పూర్తికావచ్చు. సోమవారం ఒక్కరోజే 18,460 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది.
వందశాతం.. 1,117 మంది బీఎల్వోలు
జిల్లాలో 1,117 మంది బీఎల్వోలు సోమవారం నాటికి 100శాతం డిజిటలైజేషన్ పూర్తిచేసి ముందంజలో ఉన్నారు. ఇక 90-99 శాతం మధ్య 379 మంది, 80-89 శాతం మధ్య 15 మంది బీఎల్వోలు డిజిటలైజేషన్ పూర్తిచేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. డిజిటలైజేషన్ 100శాతం పూర్తిచేసి నగరి ప్రథమ స్థానంలో నిలవగా, 97.42శాతంతో కుప్పం చివరి స్థానంలో ఉంది. గంగాఽధరనెల్లూరు 99.82, పలమనేరు 99.57, పూతలపట్టు 99.23, చిత్తూరు 97.96 శాతం పూర్తయింది.
మిషన్ మోడ్‌లో పూర్తి చేయండి: కలెక్టర్
అధికారులు, బీఎల్వోలు ఇతర సిబ్బంది సమన్వయంతో మిషన్ మోడ్‌తో పనిచేసి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియ పురోగతిపై సోమవారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అందరూ వందశాతం ప్రక్రియ పూర్తిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో కచ్చితంగా పారదర్శకత సాధించేందుకు ప్రజల సహకారం పొందాలన్నారు.