Share News

సర్‌.. 11 రకాల దోషాలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:28 AM

: ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు అందించిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌లో లాజికల్‌ ఎర్రర్‌ అనామాలిస్‌ (తార్కిక దోషాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1,10,205 ఫారాలలో పేరు, ఇంటి పేరు, చిరునామా, తండ్రి పేరు తదితర 11 రకాల దోషాలున్నాయి.

సర్‌.. 11 రకాల దోషాలు

1.10 లక్షల ఎన్యూమరేషన్‌ ఫారాల్లో గుర్తించిన అధికారులు

ఆ ఓటర్లందరికీ 31 నుంచి నోటీసులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు అందించిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌లో లాజికల్‌ ఎర్రర్‌ అనామాలిస్‌ (తార్కిక దోషాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1,10,205 ఫారాలలో పేరు, ఇంటి పేరు, చిరునామా, తండ్రి పేరు తదితర 11 రకాల దోషాలున్నాయి. మొత్తం ఓటర్లు 13,40,126 మంది ఉండగా, 12,04,067 మంది ఇచ్చిన ఫారాలను బీఎల్వోలు డిజిటలైజేషన్‌ చేశారు. మిగిలిన 1,36,059 ఫారాలను అన్‌ - కలెక్టబుల్‌గా గుర్తించారు. లాజికల్‌ ఎర్రర్‌ అనుమాలిస్‌ (తార్కిక దోషాలు) క్యాటగిరిలో జిల్లాలో 1,10,205 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు పేరులో అక్షర దోషాలు, పేర్లలో తేడాలు, చిరునామాలో తప్పులు, వయసులో హెచ్చుతగ్గులు, బంధుత్వానికి సంబంధించి తప్పులు, ఎన్యూమరేషన్‌ ఫారాలతో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకపోవడం, ఎన్యూమరేషన్‌ ఫారాలతో పాటు కేవలం ఆధార్‌ కార్డు నకళ్ళు జత చేయడం, వయస్సులో వ్యత్యాసాలు.. ఇలా ఏదో ఒక అంశంలో తప్పులు దొర్లినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. సంక్షిప్త ఓటరు జాబితా సవరణ సమయంలో బీఎల్వోలు ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకునేటప్పుడు శ్రద్ధగా ఈ దోషాలను చూడకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం.

పలమనేరులో అత్యధికం

ఇలాంటి దోషాలు అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 26,353, అత్యల్పంగా నగరిలో 8470 ఉంది. మిగిలిన నియోజకవర్గాలో.. గంగాధరనెల్లూరులో 9886, చిత్తూరులో 19,528, పూతలపట్టులో 21,304, కుప్పంలో 24,664 ఫారాలు చొప్పున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తర్వాత దోషాలు కలిగిన ఎన్యూమరేషన్‌ ఫారాలిచ్చిన ఓటర్ల ఇళ్లకు ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటింటికి వెళ్లి పునఃపరిశీలన చేస్తూ బీఎల్వోలు నోటీసులు ఇస్తారు. వాటిని సరిచేసిస్తే తుది జాబితాలో పేరు ఉంటుంది, లేకపోతే వారి పేర్లు తొలగిస్తారు.

Updated Date - Jul 27 , 2026 | 02:28 AM