Share News

ఆన్‌లైన్‌లోకి సింగిల్‌ విండోల లావాదేవీలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:04 AM

మ్మడి జిల్లాలోని 75 సింగిల్‌విండోల లావాదేవీలన్నీ డేటా కేప్చర్‌ టూల్‌ (డీసీటీ) అనే సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ చేయడం జరిగింది.

ఆన్‌లైన్‌లోకి సింగిల్‌ విండోల లావాదేవీలు
తిరుపతి జిల్లా సింగిల్‌ విండో సీఈవోలతో సమీక్షిస్తున్న అమాస రాజశేఖర్‌ రెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘ఉమ్మడి జిల్లాలోని 75 సింగిల్‌విండోల లావాదేవీలన్నీ డేటా కేప్చర్‌ టూల్‌ (డీసీటీ) అనే సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ చేయడం జరిగింది. ఇక ప్రతిపైసాకు లెక్క పక్కాగా ఉంటుంది. అడ్డుగోలు రుణాల పంపిణీ కుదరదు’ అని డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక బ్యాంకు ప్రధాన కార్యాలయ మీటింగ్‌ హాలులో పునశ్చరణ తరగతుల్లో భాగంగా తిరుపతి జిల్లాకు చెందిన సింగిల్‌విండోల సీఈవోలతో సమీక్షించారు. గతంలో విండో పరిధిలో రైతులు చెల్లించిన రుణ బకాయి సొమ్ములను ఖాతాల్లో జమ చేయకుండా సొసైటీ సిబ్బంది సొంతానికి వాడుకుని.. ఎప్పుడో జమ చేయడం చేసేవారన్నారు. ఇకపై ఇలాంటివి కుదరవని చెప్పారు. ఏరోజుకారోజు బ్యాలెన్స్‌ నిల్వల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ ఏడాది రూ.210 కోట్లు స్వల్పకాలిక రుణాలు, రూ.40కోట్లు దీర్ఘకాలిక రుణాలు, రూ.230 కోట్లు బంగారంపై రుణాలు, రూ.10 కోట్లు ఇతరత్రా రుణాలు సింగిల్‌ విండోల ద్వారా చెల్లింపులు జరిగాయన్నారు. బ్యాంకు సీఈవో శంకర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతంలోగా 40 శాతం ఉన్న రికవరీ శాతాన్ని 85కి, లాభాల దిశలో ఉన్న సింగిల్‌ విండోల సంఖ్యను 36 నుంచి 50కి పెంచాలని సూచించారు. త్వరలో చిత్తూరు, మదనపల్లె జిల్లాల పునశ్చరణ తరగతులు నిర్ణయిస్తామన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:04 AM