ఏటా తగ్గుతున్న ‘పట్టు’ సాగువిస్తీర్ణం
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:43 AM
పట్టుసాగుకు నిలయమైన పడమటి ప్రాంత మండలాల్లో ఇప్పుడు అంతంత మాత్రంగానే సాగవుతోంది
కురబలకోట, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పట్టు రైతుల్లో నైరాశ్యం అలముకుంది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. పట్టుసాగుకు నిలయమైన పడమటి ప్రాంత మండలాల్లో ఇప్పుడు అంతంత మాత్రంగానే సాగవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస ప్రోత్సాహం లభించక, రైతులు గత్యంతరం లేక ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిపోవాల్సి వచ్చింది. నికర లాభాలను ఆర్జించవచ్చుననే గట్టి నమ్మకంతో ఇక్కడి అన్నదాతలు ఈ పంటను సాగు చేసేవారు. కరోనా సమయంలో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. స్పందించి ఆదుకోవాల్సిన నాటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదు. దీంతో నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. కరోనా వరకూ పట్టు సాగు బాగానే సాగినా అనంతర పరిణామాలు రైతులకు పెనుశాపమయ్యాయి. కరోనా సమయంలో ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు నష్టపోయారు. ధరలు, తగిన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. కర్ణాటకలోని చింతామణి, కోలార్, సిల్లగట్టు తదితర ప్రాంతాలకు తరలించి ఉత్పత్తిని అమ్ముకోవడం ఇబ్బందికరంగా తయారైంది. అప్పట్లో అక్కడి మార్కెట్‌లో మొదటి రకం రూ.400 నుంచి రూ.500 వరకు, రెండో రకం రూ.250 నుంచి రూ.450 మాత్రమే విక్రయించేవారు. తర్వాత అక్కడ ధరల తగ్గుదల రైతులను కుంగదీసింది. ఇప్పుడు పెరిగినా రైతులు గతానుభవంతో ఆసక్తి చూపడంలేదు.
కనీస ప్రోత్సాహమూ కరువే..
గత వైసీపీ ప్రభుత్వం పట్టు రైతుల కోసం రాయితీలుగాని, ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. సాధారణంగా షెడ్డు నిర్మాణానికి రూ.4లక్షలు రాయితీతో సమకూర్చాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం రాయితీ ఇవ్వాలి. మిగిలింది లబ్ధిదారుడు భరించాలి. గత ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు ఆ నిధులు అందజేయలేదు. 2019కి ముందు బైవోల్టిన్ రకం పట్టు సాగుకు కిలోకు రూ.50 ప్రోత్సాహకాన్ని అందించేవారు. ఆ రాయితీని కూడా పూర్తిగా ఆపేశారు. గతంలో రైతుల సమస్యలు తీర్చడానికి ప్రతి మండలానికీ ఇన్‌స్పెక్టర్, టీఏలు ఉండేవారు. వారిలో ఎక్కువమంది రిటైరయ్యారు. ఇప్పుడు 15మండలాలకు ఒక అధికారితో కాలం వెళ్లదీస్తున్నారు.
కూటమి వచ్చాక బకాయిల విడుదల
పట్టు ధరలు గతంతో పోల్చితే ఇప్పుడు రెట్టింపు పెరిగినా సాగు విస్తీర్ణం మాత్రం భారీస్థాయిలో తగ్గిపోయింది. 15 ఏళ్ల క్రితం వరకు కురబలకోట మండల పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేసేవారు. ప్రస్తుతం 50 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టు ధరలు భారీగా పెరిగినా గత ప్రభావంతో రైతులు సాగు చేయడానికి ముందుకు రావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టు రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.