భారీగా తగ్గిన ఓటర్లు
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:59 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పనిచేయడంతో బోగస్ ఓట్లు భారీగా తగ్గాయి.
ముసాయిదా జాబితా విడుదల
తిరుపతి(కలెక్టరేట్), జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పనిచేయడంతో బోగస్ ఓట్లు భారీగా తగ్గాయి.జిల్లాలో 17,69,438మంది ఓటర్లుండగా మృతులతోపాటు ఆచూకీ లేనివారు, రెండేసి ఓట్లున్నవారిని కలిపి 2,87,835మందిని తొలగించారు. దీనివల్ల ఓటర్ల సంఖ్య 14,81,603కు చేరింది.ఇందులో పురుషులు 7,20,329మంది, మహిళలు 7,61,188మంది, ట్రాన్స్‌జెండర్లు 86మంది తేలారు. ఇక సర్వీసు ఓటర్లకు వచ్చేసరికి 854మంది నమోదై ఉన్నారు. తొలగించిన జాబితాలోని వారు తగిన ఆధారాలు సమర్పిస్తే తుది ఓటర్ల జాబితాలో చేరుస్తామని అధికారులు ప్రకటించారు.
చంద్రగిరి, తిరుపతిల్లోనే ఎక్కువ తొలగింపు
తిరుపతిలో 2,95,288మంది ఓటర్లుంటే.. 90,882మందిని జాబితా నుంచి తొలగించారు. చంద్రగిరిలో 3,13,795మంది ఉంటే.. 50,273మందిని, వెంకటగిరిలో 2,45,797 మంది ఉంటే.. 36,521మందిని, శ్రీకాళహస్తిలో 2,49,123మంది ఉంటే.. 32,836మందిని తొలగించారు. సత్యవేడు, సూళ్లూరుపేట, రైల్వే కోడూరులో తొలగించిన ఓట్ల సంఖ్య 25వేలలోపే ఉంది.
నేటినుంచి మ్యాపింగ్‌కానివారికి నోటీసులు
జిల్లాలోని మ్యాపింగ్‌కాని 1,62,230మందికి శనివారం నుంచి ఈనెల 30వ తేదీవరకు నోటీసులు జారీ చేయనున్నారు. ఎందుకంటే వీరిని కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చి ఉన్నారు. వీరు.. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. తిరుపతిలో 96,280మంది, చంద్రగిరిలో 50వేలపైచిలుకు మంది మ్యాపింగ్ కాని వారిలో ఉన్నారు. అలాగే అనామలిస్ (వయసు వ్యత్యాసాలు, కుటుంబ సంబంధాల నమోదు లోపాలు, ఇతర సాంకేతిక సమస్యలున్నవారు) కింద 2,38,863మందిని గుర్తించారు. వీరికి కూడా నోటీసులు జారీ చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి బీఎల్వోకు అందజేస్తే తుది ఓటరు జాబితాలో చేరుస్తారు. లేదంటే శాశ్వతంగా తొలగిస్తారు. సెప్టెంబరు నెల మొత్తం ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులపై అభ్యంతరాలపై విచారణ నిర్వహించి అక్టోబరు మూడో తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. ఇక ఓటర్ల జాబితాలో అక్షర దోషాలు, కొత్త ఓటరు నమోదు (2026 జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయినవారు కూడా), షిఫ్టింగ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2,221కి చేరిన పోలింగ్ కేంద్రాలు
సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1,200మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. తాజా ఓటర్ల సంఖ్యతోపాటు ఈసీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వీటిని ఏర్పాటుచేశారు. గతంలో అత్యధికంగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500పైగా ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం 1,200మందికో కేంద్రం ఏర్పాటు చేశారు. సర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 2,099 పోలింగ్ కేంద్రాలుండగా ఈ సంఖ్య 2,221కి చేరింది.
ఒక కుటుంబంలో అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలోకి
- కలెక్టర్ వెంకటేశ్వర్
జిల్లాలో సర్ ప్రక్రియ సక్సెస్ అయ్యిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఏఎ్‌సడీడీ జాబితాలోని 2,87,835మందిని తొలగించడంతో ఓటర్ల సంఖ్య 14,81,603కు చేరిందన్నారు. అనామలిస్ కింద రాష్ట్రంలో 18శాతం నమోదవగా, జిల్లాలో ఈ శాతం 13 మాత్రమేనని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజల సహకారంతో సర్ పారదర్శకంగా నిర్వహించామన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు కూడా తీసుకున్నామని గుర్తుచేశారు.కుటుంబంలోని అందరినీ ఒకే పోలింగ్ కేంద్రంలోకి తీసుకొస్తామన్నారు. అభ్యంతరాలుంటే రాజకీయపార్టీలకు చెందిన బీఎల్‌ఏలు రోజుకు 30లోపు ఫిర్యాదు చేయాలన్నారు. ఏఎ్‌సడీడీ జాబితాలో 2,87,835మంది ఉన్నారని.. వీరు ఆధారాలను ఈఆర్వోలకు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో చేరుస్తామన్నారు. ప్రతి బీఎల్వో వద్ద ముసాయిదా ఓటరు జాబితా ఉందని.. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లోనూ ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు పాల్గొన్నారు.