వేడుకగా సిద్దేశ్వరుడి రథోత్సవం
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:19 AM
కామాక్షి సమేత సిద్దేశ్వరుడి రథోత్సవం అద్యంతం వేడుకగా సాగింది. సత్యవతి నదీ తీరాన జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లను రథంపై ఆశీనులను చేశారు. రథాన్ని భక్తులు ఆలయం చుట్టూ లాగారు.
కలకడ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): కామాక్షి సమేత సిద్దేశ్వరుడి రథోత్సవం అద్యంతం వేడుకగా సాగింది. సత్యవతి నదీ తీరాన జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లను రథంపై ఆశీనులను చేశారు. రథాన్ని భక్తులు ఆలయం చుట్టూ లాగారు. ఆలయం వద్ద అర్చకులు విజయసారథి, సుబ్రహ్మణ్యం, మహేశ్, సునీల్ మహానివేదన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయం ఎదుట ప్రసాదం తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఆలయంలో మూలవిరాట్టుకు త్రినేత్రధారణ చేసి ప్రత్యేక పూజలను చేశారు. తిరునాళ్లకు వచ్చిన వేలాది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఆలయం సహా పరిసరాలు, తిరునాళ్ల జరిగే ప్రదేశాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేసి ఆలయం చుట్టూ భక్తులు రథాన్ని కలకడ వీధుల్లో లాగారు. దాతలు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. మంగళవాయిద్యాలు, పిల్లన్నగ్రోవిలు, బాణాసంచా పేల్చుతూ ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో ధర్మకర్త త్రికూటం రవీంద్రశర్మ, ఆలయ కమిటీ సభ్యులు మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, కోనేని రెడ్డెప్పనాయుడు, వేలాది ప్రజలు పాల్గొన్నారు.