Share News

టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జిగా శంకర్‌యాదవ్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:31 AM

తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా జి.శంకర్‌ యాదవ్‌ తిరిగి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జిగా శంకర్‌యాదవ్‌
శంకర్‌యాదవ్‌

మదనపల్లె, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా జి.శంకర్‌ యాదవ్‌ తిరిగి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా దాసరపల్లె జయచంద్రారెడ్డి పోటీ చేశారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డిపై ఓటమి చెందడంతో అప్పటి నుంచి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు అయితే గతేడాది అక్టోబరు 3వ తేదీన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇన్‌చార్జి లేకపోవడంతో అప్పటివరకూ స్తబ్దుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ యాదవ్‌ తెరపైకి వచ్చారు. దీంతో అటు జయచంద్రారెడ్డి, ఇటు శంకర్‌యాదవ్‌ వర్గీయుల మధ్య వివాదాలు, విభుదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ఇన్‌చార్జి నియామకానికి సంబంధించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు హర్సిలీహిల్స్‌లో, రెండోసారి ఇటీవల తిరుపతిలో సమావేశాలు నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లోనూ ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మధ్యలోనే ఘర్షణలు చోటు చేసుకోవడంతో వాయిదా పడుతూ వచ్చాయి. అనంతరం రెండుసార్లు విజయవాడకు రమ్మనడం, వివిధ కారణాలతో తిరిగి వాయిదా పడటం జరిగింది. చివరికి అధిష్ఠానం శంకర్‌యాదవ్‌ వైపే మొగ్గు చూపింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌ శంకర్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెర దించినట్లయింది. అప్పటివరకూ తంబళ్లపల్లె నియోజకవర్గం భూస్వామ్య కుటుంబాలకే రాజకీయం, పదవులు పరిమితం కాగా పీటీఎం మండలం టి.సదుం గ్రామం బీసీ వర్గానికి చెందిన జి.శంకర్‌యాదవ్‌ 2009లో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ రాలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీలో చేరిన దాసరిపల్లె జయచంద్రారెడ్డికి అనూహ్యంగా టికెట్‌ దక్కింది. అయితే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిపై ఓటమి చెందారు. తర్వాత ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ముద్రపడటంతో పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇన్‌చార్జి లేకపోవడం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శంకర్‌నే నియమిస్తారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో వ్యతిరేక వర్గమైన జయచంద్రారెడ్డి వర్గీయులు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ అడ్డుకుంటూ రావడంతో వాయిదా పడింది. చివరకు అధిష్ఠానం శంకర్‌కే పట్టం కట్టబెట్టింది. ఇదిలావుండగా, జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి నకిలీ మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడం కూడా శంకర్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి.

Updated Date - Aug 27 , 2026 | 01:31 AM