Share News

స్వరాజ్యం అందామా!

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:09 AM

బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించి 79ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు అనాగరికంలో ఉన్నామంటే అతిశయోక్తి కాదు. సమాజం శాస్త్ర, సాంకేతిక పరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా పలు గ్రామాల ప్రజలు ప్రాథమిక అవసరాలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటే వారికి నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్లేనా? అన్న ప్రశ్న రాకమానదు.

స్వరాజ్యం అందామా!
దొనబైలులో రాళ్ళబండలు పరిచిన వీధి

- 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో సదుపాయాలకు దూరంగా ఎన్నో గ్రామాలు

- గ్రామీణుల అవస్థలు పట్టని పాలకులు

బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించి 79ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు అనాగరికంలో ఉన్నామంటే అతిశయోక్తి కాదు. సమాజం శాస్త్ర, సాంకేతిక పరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా పలు గ్రామాల ప్రజలు ప్రాథమిక అవసరాలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటే వారికి నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్లేనా? అన్న ప్రశ్న రాకమానదు. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

- అన్నమయ్య/మదనపల్లె (ఆంధ్రజ్యోతి)

దయనీయ స్థితిలో కొండమీదపల్లె

మదనపల్లె మండలం కొండమీదపల్లెలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే 20 కుటుంబాలు వలసపోయాయి. కొండలు, గుట్టల మధ్య మారుమూల అటవీ ప్రాంతంలోని ఈ గ్రామంలో ఆయకట్టు భూములున్నాయి. బోరు బావులు జాడే లేదు. త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరాకు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ కూలీలుగా, పట్టణాల్లో కార్మికులుగా జీవనపోరాటం చేస్తున్నారు.

అన్నింటికీ దూరంగా మాలేపాడు

మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీలోని ఏడు గ్రామాలు, ఆవులపల్లె కేంద్రంగా ఆరు గ్రామాలు అన్నింటికీ దూరంగా ఉన్నాయి. రోడ్లు, కాలువలు, సరైన రహదారి, ముఖ్యంగా రవాణా సౌకర్యం లేదు. మదనపల్లెకు రావాలంటే ఏడు కి.మి. కాలి నడకన వచ్చి బస్సులను ఆశ్రయిస్తున్నారు. కోళ్లబైలు, చీకలబైలు పంచాయతీలలోని 18 గ్రామాలూ ఇదే స్థితిలో ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లోని తండాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

దుస్థితిలో కలికిరివాండ్లపల్లె

కేవీపల్లె మండలం మఠంపల్లె పంచాయతీ కలికిరివాండ్లపల్లెలోని 30 ఎరుకుల కుటుంబాలు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. మూడు దశాబ్దాలుగా సొంత ఇంటి కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఆర్థిక స్థోమల కలిగిన కొందరు గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు చెరువు పొరంబోకు స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.

కొండపై దొనబైలు, చీకలబైలులో సౌకర్యాలు కరువు

మదనపల్లె మండలం కొండపై దొనబైలు, చీకలబైలు గ్రామాల్లో కనీస సౌకర్యాలు ఏ మాత్రమూ కనిపించడం లేదు. సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. 30 మంది విద్యార్దులు చదువుకోవడానికి మదనపల్లెకు రావాల్సిందే. సరైన రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రోడ్డులేని కలంకపల్లె

గాలివీడు మండలం తలముడిపి పంచాయతీ కలంకపల్లెకు ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. 30 ఇళ్లు ఉన్నాయి. కేవలం ఎడ్లబండ్లు మాత్రమే వెళ్తాయి. అది కూడా పొలాల గుండా వెళ్లాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలని కనిపించిన ప్రతి అధికారిని, నాయకుడినీ అడుతున్నా ఫలితం కనిపించడం లేదు.

పాములతో సహవాసం

గుర్రంకొండ మండలం మజ్జిగవారిపల్లెలో కనీస వసతులు లేక దళితులు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు లేవు. రాత్రిపూట బయట తిరగడానికి పాములు, విషసర్పాలతో ప్రజలు భయపడుతున్నారు. విష పురుగుల బెడదతో ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు.

Updated Date - Aug 15 , 2026 | 01:09 AM