Share News

చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:09 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి ఆమె ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికకోసం శుక్రవారం చిత్తూరులోని జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.

చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజ ప్రమాణ స్వీకారం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌గా డిక్లరేషన్‌ తీసుకుంటున్న శైలజ, పక్కన వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుప్రియ

వైస్‌ చైర్‌పర్సన్‌గా మంజుప్రియ

ఇద్దరు మినహా 25 మంది జడ్పీటీసీల హాజరు

కొలువుదీరిన కొత్త పాలకమండలి

2031 నవంబరు 19వ తేదీ వరకు పదవీకాలం

చిత్తూరు అర్బన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా మందలపు శైలజ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి ఆమె ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికకోసం శుక్రవారం చిత్తూరులోని జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు కోరం ఉండటంతో ప్రక్రియ మొదలైంది. చైర్‌పర్సన్‌ పదవి కోసం పూతలపట్టు జడ్పీటీసీ సభ్యురాలు మందలపు శైలజ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమెను విజయపురం జడ్పీటీసీ సభ్యుడు బాబు ప్రతిపాదించగా.. పలమనేరు జడ్పీటీసీ సభ్యుడు నాగరాజరెడ్డి బలపరిచారు. గడువు ముగిసే సమయానికి శైలజ నామినేషన్‌ ఒక్కటే దాఖలైంది. దీంతో చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ పదవికి గుడుపల్లె జడ్పీటీసీ సభ్యురాలు మంజుప్రియ నామినేషన్‌ వేశారు. ఈమెను కుప్పం జడ్పీటీసీ సభ్యురాలు స్వాతి ప్రతిపాదించగా, శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు విజయరామిరెడ్డి బలపరిచారు. మంజుప్రియ నామినేషన్‌ ఒక్కటే దాఖలు కావడంతో ఈమె కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ ప్రకటించారు. ఆ ఇద్దరికీ డిక్లరేషన్‌ ఫారాలను అందజేసి.. ప్రమాణ స్వీకారం చేయించారు. వారిద్దరికి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇద్దరు సభ్యుల గైర్హాజరు

జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం.. జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక కార్యక్రమానికి ఇద్దరు తప్ప.. మిగతా 25 మంది హాజరయ్యారు. జిల్లాలో 27 మంది జడ్పీటీసీలున్నారు. వీరిలో పూతలపట్టు నుంచి శైలజ, బంగారుపాళ్యంలో సుచరిత, యాదమరి నుంచి యశోద ఎన్నిక ఏకగ్రీవమైంది. 24 చోట్ల ఎన్నికలు జరగ్గా టీడీపీకి 21, వైసీపీకి మూడు స్థానాలు దక్కాయి. దీంతో టీడీపీకి జడ్పీటీసీ సభ్యుల సంఖ్య 24కు చేరింది. వీరిలో సుచరిత (బంగారుపాళ్యం), శైలజ (పూతలపట్టు), మమతశ్రీ (గుడిపాల), జాహ్నవిబాబు (పాలసముద్రం) జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నారు. రాజకీయ సమీకరణాలు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ అధిష్ఠానం శైలజ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మిగతా ఆశావహుల్లోని సుచరిత, జాహ్నవిబాబు తప్ప.. వైసీపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 25 మంది జడ్పీటీసీ సభ్యులు తొలిరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, మురళీమోహన్‌, థామస్‌, చిత్తూరు మేయర్‌గా ఎన్నికైన కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుకు అండగా నిలుద్దాం

రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చడానికి రేయింబవళ్లు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు మనమంతా తోడుగా ఉందామని జడ్పీ చైర్‌పర్సన్‌ మందలపు శైలజ కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నాక జరిగిన తొలి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ నిత్యం కష్టపడుతున్నారని తెలిపారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా సహాయ సహకారాలను అందిస్తున్నారన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి చదువు చెప్పిన గురువులు, కుటుంబం, శ్రేయోభిలాషులే కారణమన్నారు. ఇప్పటి వరకు సహకరించిన వారంతా.. రాబోయే రోజుల్లోనూ ఇలాగే ప్రోత్సహించి జిల్లా అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు.

ఆమె.. జడ్పీలో కీలకం

జిల్లా పరిషత్తులో కీలకమైన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను టీడీపీ అధిష్ఠానం మహిళలకే కేటాయించింది. శైలజ, మంజుప్రియ అభ్యర్థిత్వాలను ఖరారు చేయగా.. వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ముఖ్యమైన రెండు పదవుల్లోనూ మహిళలు ఉండటం ఇదే తొలిసారి.

Updated Date - Nov 21 , 2026 | 02:09 AM