Share News

శేషశయన.. పార్వతీ తనయ

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:38 AM

కాణిపాక వినాయకస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం బంగారు చిన్న శేష.. రాత్రి బంగారు పెద్ద శేష వాహనాలపై ఉత్సవర్లు ఊరేగారు.

శేషశయన.. పార్వతీ తనయ
బంగారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్న వినాయకస్వామి

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వినాయకస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం బంగారు చిన్న శేష.. రాత్రి బంగారు పెద్ద శేష వాహనాలపై ఉత్సవర్లు ఊరేగారు. ఉదయం వినాయకస్వామి మూలవిరాట్‌కు అర్చకులు అభిషేకం నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారిని వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం బంగారు చిన్నశేష వాహనంపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్దుడు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరసను కాణిపాకం పురవీధులలో వైభవంగా తీసుకొచ్చి ఆలయంలో అర్చకులకు అందించారు. స్వామివారి కల్యాణ వేదికపై ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు ఉత్సవర్లను తీసుకొచ్చి బంగారు పెద్ద శేషవాహనంపై అధిష్ఠింపచేశారు. బాజాభజంత్రీలు, యువకుల నృత్యాల నడుమ సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను పురవీధులలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో బోర్డు సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరేష్‌, శివప్రసాద్‌, సతీష్‌, వసంత, రాజ్యలక్ష్మీ, కృష్ణవేణి, శ్రీవాణి, ఏఈవో రవీంద్రబాబు, ప్రొటోకాల్‌ ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి, బాలాజీనాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు హరిబాబునాయుడు తదితరులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

శనివారం ఉదయం చిలుక వాహన సేవ జరగనుంది. కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు ఉభయదారులు. రాత్రి జరిగే వృషభ వాహన సేవకు కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరుకు చెందిన శాలివాహన వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

వైభవంగా క్షీర కలశాల ఊరేగింపు

శేషవాన సేవను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఉభయదారులు సహస్ర క్షీర కలశాలను ఊరేగించారు. అనుంబంధ ఆలయమైన మణికంఠేశ్వరాయం నుంచి భక్తులు కలశాలను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. వారి ముందు కళాకారుల సాంస్కృతిక కళారూపాలు.. భాజా భజంత్రీలతో బ్రహ్మోత్సవ కళ ఉట్టిపడింది. ప్రధాన ఆలయంలోకి క్షీర కలశాలను తీసుకొచ్చారు. అనంతరం కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను ఉంచి తేనె, గంధం, కొబ్బరినీళ్లు, కలశాలలోని పాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, గురజాల జగన్మోహన్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు శివశంకరి, టీడీపీ మండలాధ్యకుడు హరిబాబునాయుడు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 01:38 AM