Share News

ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:45 AM

అధిక ప్రమాదాలకు కారణం డ్రైవింగ్‌ మీద పూర్తి అవగాహన లేకపోవడం, అతివేగం. జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో 80 శాతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌తోనే జరిగినట్లు తేలింది. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరు కాకుండా ప్రత్యేకంగా ఓ డ్రైవర్‌ను నియమించుకుంటే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశముంది.

ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌

80 శాతం ప్రమాదాలు వీటివల్లే

ప్రొఫెషనల్‌ డ్రైవర్లతో తక్కువే

అతి వేగం మరో కారణం

అధిక ప్రమాదాలకు కారణం డ్రైవింగ్‌ మీద పూర్తి అవగాహన లేకపోవడం, అతివేగం. జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో 80 శాతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌తోనే జరిగినట్లు తేలింది. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరు కాకుండా ప్రత్యేకంగా ఓ డ్రైవర్‌ను నియమించుకుంటే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశముంది.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా అధిక సంఖ్యలో తిరుమల దర్శనానికి వెళుతుంటారు. వీరంతా కుటుంబంతో దైవ దర్శనానికి వెళ్తుండటంతో డ్రైవర్లను పెట్టుకోవడానికి ఇష్టపడరు. దాంతో ఆ కుటుంబంలోని వ్యక్తులే డ్రైవింగ్‌ చేస్తుంటారు. కారు సీటింగ్‌కు సరిపడా ఇంట్లోవాళ్లే ఉండటం కూడా డ్రైవరును పెట్టుకోకపోవడానికి ఒక కారణం. ఇక, సాధారణంగా ఇంటి నుంచి కార్యాలయమో లేదా 10-15 కిలోమీటర్ల దూరం వరకు ప్రతి రోజూ కారులో ప్రయాణిస్తుంటారు. దీంతో డ్రైవింగ్‌పై పూర్తి పట్టు ఉందని అనుకోవడంతో పాటు రెండు రోజుల ప్రయాణంలో డ్రైవరుకు ఇవ్వాల్సిన డబ్బు మిగలతాయన్న భావనతోనూ డ్రైవర్‌ను పెట్టుకోవడం లేదు.

ఇవే ప్రధాన కారణాలు..

ఫ దూర ప్రాంతాలకు బయలుదేరేటప్పుడు.. అప్పటివరకు పార్కింగ్‌లో ఉన్న కారును తీసుకుని నేరుగా కుటుంబంతో కలిసి ప్రయాణం మొదలుపెడతారు.

ఫ కారులో ఇంజిన్‌ ఆయిల్‌ ఉందా? టైర్లలో గాలి ఉందా? కొద్ది దూరం వెళ్లినప్పుడు కారులో నుంచి ఏమైనా శబ్ధం వస్తోందా? అనే విషయాలను సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసేవారు చెక్‌ చేసుకోవడం లేదు.

ఫ ఉదాహరణకు టైరులో గాలి 40 పాయింట్లు ఉండాల్సి ఉంటే ప్రొఫషనల్‌ డ్రైవర్లు 30 పాయింట్లే పడతారు. కారు వేగంగా వెళ్లేటప్పుడు చక్రాలు స్పీడుగా తిరగడం వల్ల వాటంతటా అవే పది పాయింట్ల గాలి పెరిగిపోతుంది.

ఫ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసే వారికి ఈ విషయం తెలియకుండా ఒకేసారి 40 పాయింట్ల గాలి పట్టేయడంతో హైవే మీద వేగంగా వెళ్లే క్రమంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఫ సాధారణంగా తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో నిద్ర వస్తుంది. అంతవరకు పనుల్లో ఉండి డ్రైవింగ్‌ చేయడం వల్ల ఉన్నట్లుండి ఓ క్షణం కళ్లు మూసి తెరిచేలోగానే ఘోర ప్రమాదాలు జరిగిపోతున్నాయి.

ఫ అదే ప్రొఫెషనల్‌ డ్రైవర్లయితే నిద్ర సమయాల్లో కారును ఆపి ముఖం కడుక్కోవడమో లేదా రోడ్డు పక్కన ఆపి కాసేపు కునుకు తీసిన తర్వాత మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

ఫ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసే వారు గమ్యస్థానాన్ని చేరుకోవాలనే ఆత్రుతతో వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు.

రోడ్డుకు అడ్డంగా జంతువులు రావడంతో..

అనుభవం కలిగిన డ్రైవర్‌ అయినప్పటికీ ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఉదాహరణకు మొగిలి ఘాట్‌లో మూడు కిలోమీటర్ల వరకు కొండ మధ్యలోని రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి 8 నుంచి 10 వరకు, ఉదయం పూట 3 నుంచి 5 గంటల మధ్యలో జింకలు, పందులతో పాటు ఒక్కోసారి ఏనుగుల గుంపు రోడ్డును దాటుతుంటాయి. ఆ సమయంలో బెంగళూరు వైపు వేగంగా వచ్చే వాహనాలు డౌన్‌లో రోడ్డు దాటుతున్న జంతువులను తప్పించపోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు.

సెల్ఫ్‌ డ్రైవర్లకు పట్టు ఉండదు

మన జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 60 శాతం మరణాలు కారు, స్కూటర్లలో ప్రయాణించేవారివే. సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌ వంటివి ధరించకపోవడం, అతి వేగం, మద్యం తాగి నడపడం, మైనర్లు డ్రైవింగ్‌ చేయడం వంటి కారణాలతో పాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ప్రధాన కారణం. సెల్ఫ్‌ డ్రైవర్లకు పట్టు ఉండదు. లాంగ్‌ డ్రైవింగ్‌లకు కచ్చితంగా డ్రైవర్లు ఉండాలి.

- నిరంజన్‌ రెడ్డి, డీటీసీ, చిత్తూరు

ప్రొఫెషనల్‌ డ్రైవర్లయితే మంచిది

దూర ప్రాంతాలకు వెళ్లేవారు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కాకుండా ప్రొఫషనల్‌ డ్రైవర్లను పెట్టుకుంటే మంచిది. ఒక వేళ వేగంగా వెళ్లినా అంతే వేగంగా వాహనాన్ని కంట్రోల్‌ చేస్తారు. అవసరమైతే డ్రైవర్‌నే కాదు.. కారునూ అద్దెకు తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే అద్దెకార్లు మంచి కండిషన్‌లో ఉంటాయి.

- తుషార్‌ డూడీ, ఎస్పీ

Updated Date - Mar 05 , 2026 | 12:45 AM