Share News

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:48 AM

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. పుత్తూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 84 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అక్కడ ఛైర్మన్‌ స్థానానికి 5, వార్డుల్లో 79 చొప్పున నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. తిరుపతిలో మేయర్‌ స్థానానికి 12 నామినేషన్లు, డివిజన్లకు సంబంధించి 14 నామినేషన్లు చొప్పున మొత్తం 26 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ముగిసిన నామినేషన్ల పరిశీలన
తిరుపతిలో సోమవారం సమావేశమైన కూటమి పార్టీల నేతలు

కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు

తిరుపతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. పుత్తూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 84 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అక్కడ ఛైర్మన్‌ స్థానానికి 5, వార్డుల్లో 79 చొప్పున నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. తిరుపతిలో మేయర్‌ స్థానానికి 12 నామినేషన్లు, డివిజన్లకు సంబంధించి 14 నామినేషన్లు చొప్పున మొత్తం 26 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాయుడుపేలో ఛైర్మన్‌ స్థానానివి 4, వార్డులవి 14 చొప్పున మొత్తం 18 నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. వెంకటగిరిలో ఛైర్మన్‌ సీటువి 2, వార్డులవి 14 వంతున మొత్తం 16 నామినేషన్లను తిరస్కరించారు.సూళ్లూరుపేటలో మాత్రం అన్ని నామినేషన్లూ సక్రమంగా వున్నాయని రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. తిరుపతి కార్పొరేషన్‌లో నామినేషన్ల దాఖలు సమయంలోనే 12వ డివిజన్‌కు సింగిల్‌ నామినేషన్‌ దాఖలైన కారణంగా ఆ సీటు టీడీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన స్ర్కూటినీలో 13, 25, 46 డివిజన్లలో దాఖలైన ఇతర నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో టీడీపీ సింగిల్‌ నామినేషన్లు ఫోర్స్‌లో వుండి ఆ మూడూ కూడా టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. దీంతో నామినేషన్ల ఉపసంహరణ పర్వం మొదలు కాకముందే టీడీపీకి నాలుగు డివిజన్లు దక్కినట్లయింది. కాగా కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తిరుపతిలో మొత్తం 66 డివిజన్లకు గానూ బీజేపీకి 5, జనసేనకు 22 చొప్పున కేటాయించారు. దాని ప్రకారం అన్నేసి డివిజన్లలో ఆయా పార్టీల అభ్యర్థులు బరిలో వున్నారు.అయితే మేయర్‌ పదవి దక్కని స్థానిక సంస్థల్లో జనసేనకు 50 శాతం సీట్లు కేటాయించాలన్న కూటమి విధాన నిర్ణయం ప్రకారం తమకు ఇంకా 11 సీట్లు అదనంగా ఇవ్వాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రతిపాదిస్తున్నారు. దీంతో సమస్య తలెత్తింది. ఎమ్మెల్యే ప్రతిపాదనను ఆమోదిస్తే నాలుగైదు డివిజన్లలో మాత్రమే అదనంగా జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసివున్నందున ఆయాచోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచీ తప్పుకోవాలి. మిగిలిన స్థానాల్లో ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ స్వతంత్రులను తమవైపు తిప్పుకున్నా వారికి జనసేన బీఫామ్‌ ఇచ్చినా చెల్లుబాటు కాదు. దీనిపై సోమవారం చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో జనసేనకు మూడేసి వార్డులు కేటాయించారు. అయితే రెండేసి స్థానాల్లో మాత్రమే అభ్యర్ధులు బరిలో వున్నారు.రెండు మున్సిపాలిటీల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేక ఒక్కో స్తానాన్ని వదులుకున్నట్టయింది. కాగా సూళ్లూరుపేటలో బీజీపీకి 4 వార్డులు కేటాయిస్తే ఆ పార్టీ వారు ఏడు వార్డుల్లో నామినేషన్లు వేశారు. అదనంగా వేసిన మూడు వార్డుల నుంచీ అభ్యర్థులు పోటీ నుంచీ తప్పుకోవాల్సి వుంది. అయితే ఏయే వార్డులనేదానిపై స్పష్టత రాలేదు. దీనిపై పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ నివాసంలో సోమవారమంతా చర్చలు జరిగాయి. నాయుడుపేటలో సీట్ల సర్దుబాటుపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం నివాసంలో చర్చలు నడిచాయి.

Updated Date - Oct 20 , 2026 | 01:48 AM