Share News

నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:37 AM

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీల్లో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించిన అధికారులు.. చెల్లుబాటైన, తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి
కుప్పంలో మున్సిపల్‌ నామినేషన్ల పరిశీలన దృశ్యం

నగరి మున్సిపల్‌ చైర్మన్‌ టీడీపీ ఖాతాలో..

పలమనేరులో ఆరు ఏకగ్రీవమయ్యే అవకాశం

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీల్లో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించిన అధికారులు.. చెల్లుబాటైన, తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు.

నగరి చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం

నాలుగో వార్డు కూడా..

నగరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరి మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ఈఎన్‌ శ్రీనివాసన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌ స్థానానికి మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైసీపీకి చెందిన 10, టీడీపీకి సంబంధించి రెండు నామినేషన్లు సోమవారం నాటి పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన రెండూ టీడీపీకి చెందిన ఈఎన్‌ శ్రీనివాసన్‌వే. వైసీపీ నామినేషన్ల తిరస్కరణకు గల కారణాలను రాసి సంతకం పెట్టి మరీ ఆర్వో విడుదల చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో (ఎన్నికల ఖర్చుల ప్రకటన దాఖలు చేయనందున) తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక, 40 వార్డులకు 283 నామినేషన్లు దాఖలుకాగా ఐదు తిరస్కరణకు గురయ్యాయి. చెల్లుబాటైన వాటిలో వైసీపీ నుంచి 128, టీడీపీ నుంచి 119, స్వతంత్రులు 18, బీజేపీ 6, జనసేన 3, సీపీఐ 2, బీఎస్పీ, కాంగ్రెస్‌ నుంచి ఒక్కోటి ఉన్నాయి. నాలుగో వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 39 వార్డులకు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి.

చిత్తూరులో నాలుగు డివిజన్లు ఏకగ్రీవం!

చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌లో 8, 9, 38, 39 డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీతో ఈ నాలుగు డివిజన్లలోని టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మేయర్‌ సహా 56 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చిత్తూరు మేయర్‌ పదవికి 9 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలనలో ఒకటి తిరస్కరణకు గురైంది. టీడీపీ 3, వైసీపీ 1, కాంగ్రెస్‌ 1, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు చొప్పున ఎనిమిది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. 60 డివిజన్లకు 606 నామినేషన్లు దాఖలుకాగా, 369 ఆమోదం పొందాయి. టీడీపీ 187, వైసీపీ 115, జనసేన 24, బీజేపీ 11, ఇతర పార్టీలు 03, సీపీఐ 01, స్వతంత్రులు 39 మంది నామినేషన్లు చెల్లుబాటు కాగా, నాలుగు డివజన్లు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.

కుప్పంలో చైర్మన్‌కు 9, వార్డులకు 184

కుప్పం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లను సోమవారం ఆర్వో వి.శ్రీనివాసరావు పరిశీలించారు. డబుల్‌, త్రిబుల్‌ ఎంట్రీలు పోను మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు కాగా, నాలుగు తిరస్కరణకు గురయ్యాయి. 9 ఆమోదం పొందాయి. టీడీపీ 3, వైసీపీ 4, బీఎస్పీ 1, కాంగ్రెస్‌ 1 చొప్పున బరిలో మిగిలారు. 32 వార్డులకు 197 నామినేషన్లు దాఖలు కాగా 13 తిరస్కరించారు. ఆమోదం పొందిన వాటిలో టీడీపీ 79, వైసీపీ 73, జనసేన 12, బీజేపీ 2, స్వతంత్రులు 18 మంది ఉన్నారు.

పలమనేరులో 12 తిరస్కరణ

చైర్మన్లన్నీ ఓకే

పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీలోని 36 వార్డులకు 114 నామినేషన్లు దాఖలవ్వగా.. 12 తిరస్కరణకు గురయ్యాయి. 104 చెల్లుబాటయ్యాయి. తిరుస్కరణకు గురైనవాటిలో ఆరు వైసీపీ అభ్యర్థులవి ఉన్నాయి. దీంతో 21వ తేదీన విత్‌డ్రా తర్వాత ఆ ఆరు వార్డులు టీడీపీకు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. పార్టీల వారీగా చూసుకుంటే టీడీపీ నుంచి 59, వైసీపీ నుంచి 34, కాంగ్రెస్‌, జనసేన నుంచి 3 చొప్పున, బీజేపీ నుంచి 2 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. చైర్మన్‌ పదవికి 5 నామినేషన్లు దాఖలవ్వగా, అన్నీ చెల్లుబాటయ్యాయి. వీటిలో టీడీపీ, వైసీపీ నుంచి 2 చొప్పన, కాంగ్రెస్‌ నుంచి ఒకటి నామినేషన్‌ ఉన్నాయి.

Updated Date - Oct 20 , 2026 | 01:37 AM