అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:51 AM
చిత్తూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీఐడీ డీస్పీలు భాస్కర్‌రెడ్డి, రంగస్వామి చిత్తూరులోని సాయుధ దళ కార్యాలయంలో బాధితుల బాండ్లను పరిశీలించారు.
నేడు ఎస్‌ఆర్‌పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాలకు..
చిత్తూరు అర్బన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీఐడీ డీస్పీలు భాస్కర్‌రెడ్డి, రంగస్వామి చిత్తూరులోని సాయుధ దళ కార్యాలయంలో బాధితుల బాండ్లను పరిశీలించారు. తొలి రోజున గుడిపాలకు సంబంధించి ముగ్గురు, పెనుమూరు మండలానికి చెందిన 15 మంది చొప్పున మొత్తం 18 మంది బాధితుల బాండ్లను వీరు పరిశీలించి.. వివరాలు సేకరించారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్ల బాండ్ల పరిశీలన వివరాలను నమోదు చేసుకున్నారు. శనివారం ఎస్‌ఆర్‌పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను పరిశీలించనున్నారు. కాగా, శుక్రవారం బాండ్లకు పరిశీలనకు రాని గుడిపాల, పెనుమూరు మండలాలకు చెందిన బాధితులు కూడా శనివారం తమ బాండ్లను పరిశీలించుకోవచ్చని సీఐడీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
ఏమేం తీసుకు రావాలంటే..
బాధితులు ఒరిజనల్ అగ్రిగోల్డ్ బాండ్, నగదు రసీదు (పరిశీలన కోసం మాత్రమే), బాండు నెంబరు, అన్ని వివరాలు స్పష్టంగా కనిపించేలా సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్, పాస్‌బుక్ ఫస్ట్‌పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజుఫోటో, మొబైల్ నెంబరు (బ్యాంకు ఖాతాకు అనుసంధానమైనది) తీసుకురావాలి. ఎవరైనా డిపాజిటర్లు మరణించి ఉంటే మరణ ధ్రువీకరణ పత్రం, చట్టబద్ధ నామినీకి సంబంధించిన వివరాలను తెలియజేయాలి. ఏజెంట్లు తమ ఏజెంట్ కోడ్, గుర్తింపు పత్రాలు, బ్యాంకు వివరాలు, బాండ్ల వివరాలను సమర్పించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన జరుగుతుంది. సమర్పించిన పత్రాలకు ధ్రువీకరణ రసీదును అధికారులు అందజేస్తారు.
ఆందోళన చెందొద్దు: సీఐడీ డీఎస్పీ
తమ మండలానికి కేటాయించిన తేదీల్లో హాజరుకాని బాధితులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఐడీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి చెప్పారు. డేటా సేకరణ పూర్తయ్యే వరకు బాండ్ల సేకరణ, పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. చివరి దశలో మరో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. బాధితులకు కేటాయించిన తేదీల్లో సాధ్యమైనంత వరకు వచ్చి పరిశీలన చేసుకోవాలన్నారు. ఆదివారం వెరిఫికేషన్ జరగదన్నారు.